ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగిన ప్రాంతానికి ముఖ్యమంత్రి వెళ్లలేదని బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్నారు. అయితే వారు కూడా వెళ్లలేదు. తాము వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం అందుకే వెళ్లలేదని వారం తర్వాత వెళ్లి హరీష్ రావు కాస్త రాజకీయ ప్రదర్శన చేశారు. అదే నల్లగొండ , నాగర్ కర్నూలు జిల్లాలకు చెందిన మంత్రులు వెళ్తే మాత్రం.. అదేమైనా టూరిస్టు ప్లేసా .. రోజూ ఎందుకు వెళ్తున్నారు.. అని అంటున్నారు. అన్నీ బీఆర్ఎస్ నేతలే మాట్లాడుతున్నారు. అయితే గతంలో ఇలాంటి ప్రమాదాలు, ఘోరాలు జరిగినప్పుడు ప్రభుత్వం ఇలాగే స్పందించిందా.. ముఖ్యమంత్రి.. మంత్రులు వెళ్లారా అని వెనక్కి తిరిగి చూసుకుంటే బీఆర్ఎస్ కు ఘోరమైన ట్రాక్ రికార్డ్ ఉంది.
కేసీఆర్, బీఆర్ఎస్ నేతలు ఎంతగా సర్దిచెప్పుకున్నా సమర్థించుకోలేని ఇష్యూ.. కొండగట్టు ప్రమాదం. ఓ ఆర్టీసీ బస్సు ఓవర్ లోడ్‌తో అదీ కూడా బస్సు సామర్థ్యం కన్నా రెట్టింపు మందిని ఎక్కించుకుని వెళ్తూ కొండగట్టు వద్ద బోల్తా పడింది. ఏకంగా అరవై రెండు మంది చనిపోయారు. ఒక్క బస్సు ప్రమాదంలో అంత మంది చనిపోవడం ప్రపంచ వార్త అయింది. కానీ సీఎంగా కేసీఆర్ ఆ వైపు కూడా చూడలేదు. బాధితులకు కనీస సాయం అందలేదు. చాలా మంది మృతుల కుటుంబాల నిరుపేదలు కావడంతో ఫ్రీజర్ బాక్సులు కూడాపెట్టుకోలేక ఐస్ గడ్డల మీద మృతదేహాల్ని ఉంచారు. ఫ్రీజర్ సాయం కూడా ప్రభుత్వం వైపు నుంచి రాలేదు.
అలాంటి ఘోరాలు..శ్రీశైలం పవర్ ప్లాంట్ లో ప్రమాదం దగ్గర నుంచి వరదలకు కాళేశ్వరం మోటార్లు మునిగిపోవడం వరకూ చాలా జరిగాయి. కానీ కేసీఆర్ ఏ నాడూ పట్టించుకోలేదు. అంత కంటే ఘోరం ఏమిటంటే.. ఆ ప్రమాదాలకు సబంధించి అసలు విషయాలేమీ బయటకు రాకుండా చేయాలనుకోవడం. సమాచారం వచ్చేది కాదు.. అక్కడకు ఎవర్నీ పోనిచ్చేవారు కాదు. ప్రచారం జరుగుతుందని మంత్రులు కూడా పోయేవారు కాదు.
కానీ ఇపుడు మాత్రం.. సీఎం రాలేదని అంటున్నారు. మంత్రులు వెళ్తే అదేమైనావిహారయాత్రనా అంటున్నారు. రెస్క్యూ ఆపరేషన్లను మంత్రులు చేస్తున్నట్లుగా వారిది చేతకానితనమంటున్నారు. ఆర్మీ సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నాయి. వారి ప్రయత్నాలను కించ పరుస్తున్నారు. రాజకీయం చేయవచ్చు కానీ ప్రతీది చేస్తే ఇబ్బందేనని .. సామాన్యులు అనుకునేలా బీఆర్ఎస్ రాజకీయం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.