హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ అనే పీ.హెచ్.డి చేస్తున్న దళిత విద్యార్ధి ఆత్మహత్య చేసుకోవడం చాలా విచారకరమయిన విషయం. అందుకు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు, విద్యార్ధులు కూడా చాల బాధపడుతున్నారు. కానీ రాజకీయాలకు కాదేదీ అనర్హం అన్నట్లుగా మనసుని కలచివేసే ఈ సంఘటనపై అన్ని పార్టీలు రాజకీయాలు చేయడం మొదలుపెట్టేశాయి. రోహిత్ ఆత్మహత్యకు కారకులెవరో పోలీసుల విచారణలో తేలవచ్చును. లేదా కొన్ని రోజుల తరువాత అనేక ఇతర కేసులలాగే దీనిని కూడా పక్కన పడేసినా ఆశ్చర్యమేమీ లేదు. కానీ రోహిత్ ఆత్మహత్యకంటే రాజకీయ నేతలు చేస్తున్న శవరాజకీయాలు చూస్తుంటే ఇంకా ఎక్కువ బాధ కలిగిస్తోంది. అతని మరణానికి కేంద్ర మంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ, వర్సిటీలోని కొందరు ఎబివిపి విద్యార్ధులే కారణమని ఆరోపిస్తూ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదు అయ్యేయి. వారిరువురే రోహిత్ ఆత్మహత్యకు కారణమని తెరాస ఎంపి కవిత ఆరోపించారు.
తెరాస, కాంగ్రెస్ పార్టీ నేతలు వర్సిటీకి వచ్చి సస్పెండ్ అయిన మిగిలిన విద్యార్ధులకు సంఘీభావం తెలిపి వెళుతున్నారు. ఈ సంఘటనపై డిల్లీలో విద్యార్దీ సంఘాలు తీవ్ర నిరసనలు తెలిపాయి. ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి హడావుడిగా హైదరాబాద్ వచ్చి సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ స్మారకార్ధం ఏర్పాటు చేసిన స్థూపం వద్ద రోహిత్ కి నివాళులు అర్పించేరు. ఆయనతో బాటే కాంగ్రెస్ పార్టీ నేతలు రావడం చాలా సహజమే.
రాజకీయ నేతలు అందరూ నిజంగానే రోహిత్ మరణానికి బాధపడుతున్నారంటే నమ్మలేము. ఎందుకంటే గత ఏడాదిన్నర కాలంలో రెండు తెలుగు రాష్ట్రాలలో కనీసం పది మంది విద్యార్ధులు, విద్యార్ధినులు వేర్వేరు కారణాల చేత ఆత్మహత్యలు చేసుకొన్నారు. అప్పుడే రాజకీయ నాయకుడు ఈవిధంగా పరిగెత్తుకొని రాలేదు. కారణం ఎమింటంటే అప్పుడేమీ ఎన్నికలు లేవు. కానీ ఇప్పుడు జి.హెచ్.ఎం.సి. ఎన్నికలలు, నారాయణ ఖేడ్ ఉపఎన్నికలున్నాయి.
జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు అన్ని పార్టీలకి చాలా కీలకమయినవి. బహుశః అందుకే రాహుల్ గాంధి హడావుడిగా హైదరాబాద్ లో వాలిపోయి ఉండవచ్చునని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఒకవేళ జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు ఇప్పుడు లేకుంటే ఆయన హైదరాబాద్ వచ్చేవారా..లేదా? అని ఆలోచిస్తే ఆయన ఆకస్మిక పర్యటన ఎందుకో అర్ధమవుతుంది. ఇదే సూత్రం మిగిలిన పార్టీలకి వర్తిస్తుందని చెప్పవచ్చును.
రోహిత్ ఆత్మహత్యకి కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతీ ఇరానీ పరోక్షంగా కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి కనుక గ్రేటర్ ఎన్నికలలో ఆ దుష్ఫలితం బీజేపీపై దానితో కలిసి పోటీ చేస్తున్న తెదేపా ఎంతో కొంత పడవచ్చును. అందుకే కాంగ్రెస్, తెరాస నేతలు మీడియా ముందుకు వచ్చి రోహిత్ ఆత్మహత్య గురించి మాట్లాడుతూ బీజేపీపై విమర్శలు గుప్పిస్తున్నారనుకోవలసి ఉంటుంది.
రాజకీయ పార్టీలు ఆడుకొంటున్న ఈ వికృత రాజకీయ క్రీడని విద్యార్ధులు అర్ధం చేసుకొని, రాజకీయ నేతలందరినీ వర్సిటీకి దూరంగా ఉంచి ఈ సమస్య పరిష్కారానికి కృషి చేసి, చనిపోయిన రోహిత్ కి, అతనితో పాటు సస్పెండ్ అయిన మిగిలిన విద్యార్ధులకి న్యాయం జరిగేలా కృషి చేస్తే బాగుంటుంది. వారు రాజకీయ నాయకులని ఆశ్రయించడం కంటే మానవ హక్కుల కమీషన్ లేదా న్యాయస్థానాలను ఆశ్రయించడం వలన వారికి న్యాయం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది.