`మా` బిల్డింగ్ వ్యవహారం… ఏళ్ల తరబడి నలుగుతూనే ఉంది. `మా` అధ్యక్ష ఎన్నికలు జరిగే ప్రతీసారీ ఇదే రచ్చ. ఇప్పుడూ అంతే. కాకపోతే ఇది వరకటి కంటే వాడిగా, వేడిగా చర్చ నడుస్తోంది. `మా` బిల్డింగ్ నేను కట్టేస్తా అని మంచు విష్ణు ముందుకొచ్చాడు. అయితే ఇదంత తేలిగ్గా తెగే వ్యవహారం కాదు. నిజానికి.. మా బిల్డింగ్ ఇది వరకే పూర్తి కావాల్సింది. కానీ హీరోలు చొరవ చూపించకపోవడంతో ఆగిపోయింది.
సీసీఎల్ గుర్తుంది కదా? సినీ నటులుంతా కలిసి ఆడే క్రికెట్ లీగ్. అప్పట్లో ఈ లీగ్ కి మంచి క్రేజ్ ఉండేది. సీసీఎల్ విష్ణు ఇందూరి బ్రైన్ ఛైల్డ్. స్టార్లందరినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి క్రికెట్ ఆడించడం అంటే మాటలు కాదు. కానీ ఏళ్ల తరబడి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నడిపించాడు. అప్పట్లో విష్ణు ఇందూరి ఓ ప్లానింగ్ తో ఈ టోర్నీ ప్రారంభించాడు. ఓ చక్కటి ప్రతిపాదన కూడా తీసుకొచ్చాడు. తెలుగులో పెద్ద స్టార్లు (మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటివాళ్లంతా) సీసీఎల్ లో కనీసం ఒక్క మ్యాచ్ అయినా ఆడతానని ముందుకొస్తే.. `మా`బిల్డింగ్ కట్టిస్తా.. అన్నార్ట. కానీ అప్పట్లో హీరోలెవరూ మొగ్గు చూపించలేదు. సీసీఎల్ అయిపోయాక.. విష్ణు మాట తప్పుతాడని భయమో, `మా` బిల్డింగ్ కడితే, ప్రత్యక్షంగా వాళ్లెవరికీ ప్రయోజనం లేదన్న ఆలోచనో.. తెలీదు గానీ, అప్పట్లో ఎవ్వరూ ఈ ప్రతిపాదనకు అంగీకరించలేదు. సీసీఎల్ లో తెలుగు స్టార్లు కనిపించినా.. అందులో బడా హీరోలెవరూ ఉండేవారు కాదు. సరిగ్గా ఇదే ప్రతిపాదన… కన్నడలో తీసుకెళ్తే, అక్కడ హీరోలంతా సై అన్నారు. అలా.. కన్నడ స్టార్స్ కి బెంగళూరులో తన సొంత డబ్బుతో ఓ బిల్డింగ్ కట్టిచ్చాడు విష్ణు ఇందూరి. నిజానికి సీసీఎల్ సమయంలోనే హీరోలంతా ముందడుగు వేస్తే.. ఇప్పుడు మా బిల్డింగ్ గురించి ఇంత రాద్ధాంతం జరిగేదే కాదు.