లతా మంగేష్కర్… నిన్నటి వరకూ పాటల పూదోట. ఇప్పుడొక జ్ఞాపకం. లతాజీ సాధించిన విజయాలు అపూర్వం.. అనితర సాధ్యం. ఆమె దాదాపు 50 వేల పాటలు పాడారన్నది ఓ అంచనా. ఇన్ని పాటలు పాడిన గాయనీమణి మరొకరు లేరు. 1974లోనే గిన్నిస్ బుక్ ఆమె ప్రతిభ గుర్తించింది. అప్పటికి లత 25 వేల పాటలు పూర్తి చేశారు. అందుకే అత్యధిక పాటలు పాడిన గాయనిగా ఆమె పేరు గిన్నిస్ బుక్ లో లిఖించారు. అయితే ఆ తరవాత.. కొన్నేళ్లకు లతాజీ పేరుని గిన్నిస్ బుక్ తొలగించి, అందరినీ ఆశ్చర్యపరిచింది.
వివరాల్లోకి వెళ్తే.. 1974లో లతా మంగేష్కర్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కాక.. మరో లెజెండరీ గాయకుడు మమహ్మద్ రఫీ.. దానిని క్లైమ్ చేశారు. లతా కంటే నేనే ఎక్కువ పాటలు పాడాను అని ఆధారాలు చూపించారు. దాంతో.. గిన్నిస్ బుక్ ఆలోచనలో పడింది. 1975లో వచ్చిన ఎడిషన్ లో లత పేరుతో పాటు రఫీ పేరు కూడా చేర్చింది. ఆ తరవాత ఆధారాలు సేకరిస్తే అప్పటికి లత పాడిన పాటలు 5 వేలే అని తేలింది. లతాజీ అంతకంటే ఎక్కువ పాటలు పాడినా, వాటి వివరాలు ఎక్కడా రాసుకోలేదు. అందుకే.. చాలా పాటలు కనుమరుగైపోయాయి. అలా పాతిక వేల పాటలు పాడినా… కేవలం 5 వేలే దొరికాయి. అందుకే.. 1991లో లత పేరుని గిన్నిస్ బుక్ తొలగించింది. ఇప్పటికైతే గిన్నిస్ బుక్లో అత్యధిక పాటలు పాడిన గాయకుడుగా ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, గాయనిగా సుశీల పేర్లు లిఖించబడ్డాయి.