ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందనట్లు తెలుస్తోంది. చంద్రబాబు ఆహ్వానిస్తే ప్రమాణస్వీకారానికి హాజరు అవుతానని రేవంత్ ఇటీవల స్పష్టం చేసినా ఆయనకు ఆహ్వానం అందకపోవడం చర్చనీయాంశం అవుతోంది. చంద్రబాబు- రేవంత్ మధ్యనున్న సన్నిహిత సంబంధాల దృష్ట్యా రేవంత్ కు ఆహ్వానం అందటం పక్కా అని అంతా భావించారు. కానీ, ఆయనకు ఇప్పటివరకు ఆహ్వానం అందనట్లుగా సమాచారం.
సాధారణంగా ముఖ్యమంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమాలకు పక్క రాష్ట్రాల సీఎంలను ఆహ్వానించడం ఆనవాయితీ. గతంలో జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు తెలంగాణ సీఎంగానున్న కేసీఆర్ హాజరయ్యారు. ఈసారి ఏపీలో చంద్రబాబు గెలుపొందటంతో సీఎం రేవంత్ రెడ్డి ఫోన్ చేసి కూటమి ఘన విజయంపై శుభాకాంక్షలు కూడా చెప్పారు. పైగా..ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందితే అటెండ్ అవుతానని స్పష్టం చేశారు.
కానీ అనూహ్యంగా రేవంత్ కు చంద్రబాబు నుంచి ఆహ్వానం అందలేదు. రేవంత్ కు ఆహ్వానం అందకపోవడానికి రాజకీయ అంశాలే కారణమని తెలుస్తోంది. ఎన్డీయే కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటం, ఇండియా కూటమి తరఫున సార్వత్రిక ఎన్నికల్లో పెద్దఎత్తున ప్రచారం చేసిన రేవంత్ ను ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్తాయని చంద్రబాబు భావించినట్టుగా తెలుస్తోంది.
మరోవైపు..ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీతోపాటు ఎన్డీయే కూటమి ముఖ్యమంత్రులు , కేంద్రమంత్రులు హాజరు అవుతుండటంతో రేవంత్ ఈ వేదికను పంచుకోవడానికి ఇబ్బందిగా కూడా ఉంటుంది. వీటన్నింటిని పరిశీలించే రేవంత్ ను చంద్రబాబు ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఆహ్వానించలేదని తెలుస్తోంది.