వ్యాక్సిన్లకు కులం అంటగట్టేసి విమర్శలు చేస్తున్న ఏపీ ప్రభుత్వ పాలకులు.. అధికార పార్టీ నేతలు ఇప్పుడు భారత్ బయోటెక్ సంగతి చూసేశామని చెప్పుకుంటున్నారు. కోవాగ్జిన్ ఫార్ములాను ఇతర కంపెనీలకు ఇచ్చేలా జగన్ ఇలా లేఖ రాయగానే.. అలా ఇచ్చేశారని చెప్పుకుంటున్నారు. సోషల్ మీడియాలో ప్రచారం హోరెత్తిస్తున్నారు. నిజానికి కేంద్రం కోవాగ్జిన్ ఉత్పత్తిని ఇతర చోట్లా చేసేందుకు టెక్నాలజీ బదిలీని ఎప్పుడో ప్రారంభించింది. అయితే కోవాగ్జిన్ ఉత్పత్తి చేయడానికి ప్రత్యేకమైన ల్యాబ్లు ఉండాలి. భారత దేశంలో ఏ బయోటెక్ కంపెనీ దగ్గరా ఆ ల్యాబ్లు లేవు. దాంతో కేంద్రమే డబ్బులిచ్చి… మూడు చోట్ల.. కోవాగ్జిన్ ఉత్పత్తికి అవసరమయ్యే ల్యాబ్లను సిద్ధం చేయిస్తోంది. అందుకే.. ఉత్పత్తి పెంచుతామని అదే పనిగా చెబుతోంది.
ఈ వివరాలన్నీ పట్టించుకోని వైసీపీ సోషల్ మీడియా.. భారత్ బయోటెక్ అతి పెద్ద ఆస్తి లాంటి కోవాగ్జిన్ ఫార్ములాను షేర్ చేయించేశామని.. ఇక వారికి పుట్టగతులుండవన్నట్లుగా ప్రచారం చేసి సంతృప్తి పొందుతున్నారు. అదంతా జగన్ లేఖ వల్లే సాధ్యమయిందని కూడా.. ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు. నిజంగా జగన్ లేఖ వల్లే కేంద్రం అంత దూకుడుగా స్పందిస్తే… అదే జగన్మోహన్ రెడ్డి చాలా కాలంగా విభజన హామీల దగ్గర్నుంచి ఆక్సిజన్, టీకాల వరకూ.. కొన్ని వందల లేఖలు రాసి ఉంటారని.. వాటిపై ఎందుకు స్పందించలేదన్న ప్రశ్నలు.. నెటిజన్ల నుంచి వస్తున్నాయి. రాష్ట్రానికి పనికి వచ్చే ఒక్క లేఖ మీద అయినా మోడీ స్పందించలేదు కానీ.. సంబంధం లేని భారత్ బయోటెక్ పై చర్యలు తీసుకున్నారా అని ప్రశ్నిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్లో కరోనా రోగులు పెరుగుతున్నారు. రోజుకు సగటున ఇరవై వేలకుపైగా కేసులు నమోదవుతున్నాయి. ఆక్సిజన్ అవసరమున్నవారి సంఖ్య పెరుగుతోంది. ఏపీలో వైద్య సౌకర్యాలు అందక.. పెద్ద ఎత్తున పొరుగు రాష్ట్రాలకు వెళ్తున్నారు. ఈ పరిస్థితుల్లో టీకాలు ఇవ్వడమే మార్గమని చెబుతున్న ఏపీ సర్కార్.. దేశీయ కంపెనీలకు ఆర్డర్లు పెట్టడంలో విఫలమయింది. ఇప్పుడు టెక్నాలజీ బదిలీ పేరుతో.. కాస్త ప్రచారం చేసుకుంటోంది. ప్రజలు తమ ఇబ్బందులు కన్నా.. ఒక వర్గం వారిని ఇబ్బంది పెడితే ఎక్కువ సంతోషిస్తారన్నట్లుగా అధికార పార్టీ చర్యలు ఉండటం… అందర్నీ విస్మయపరుస్తోంది.