ఆగస్ట్ 1 నుండి సినిమా షూటింగులు బంద్ అని ఛాంబర్ ప్రకటించింది. ఛాంబర్ అనే కంటే నిర్మాత దిల్ రాజు అనడం సబబు. నిజానికి బంద్ మీద ఎవరికీ ఆసక్తి లేదు. చాలా సినిమాలు విడుదల తేదికి తగ్గట్టు షూటింగ్ ని ప్లాన్ చేసుకున్నాయి. ఒక్క రోజు ప్లాన్ చెడిపోయిన అందుకోవడం కష్టం. అలాగే జరిగే నష్టం కూడా భరించడం కష్టమే. అందుకే చాలా మంది నిర్మాతలు బంద్ కి మొగ్గు చూపలేదు. కానీ దిల్ రాజు మాత్రం బంద్ జరగాల్సిందే అని పట్టుబట్టారు.చివరికి బంద్ ప్రకటించారు.
ఐతే కంచే చేను మేసినట్లు ఆయన సినిమానే ఈ రోజు షూటింగ్ జరుపుకుంటుంది. విజయ్- వంశీ పైడిపల్లి సినిమా ‘వారసుడు’ షూటింగ్ ఆగలేదు. దీనిపై వివరణ ఇచ్చిన దిల్ రాజు.. ఇది తెలుగు సినిమా కాదని, ద్విభాషా చిత్రమని చెబుతున్నారు. చాలా హాస్యాస్పదమైన సమాధానం ఇది. ప్రెస్ మీట్, మీడియా ముందు వారసుడు తెలుగు సినిమా, విజయ్ ని తెచ్చి తెలుగు లో సినిమా తీస్తున్నామని గొప్పగా చెబుతున్నారు. అంతేకాదు ఈ సినిమాకి పని చేస్తున్న దాదాపు టీం తెలుగు వాళ్ళే. దాదాపు హైదరాబాద్ లోనే షూటింగ్ చేస్తున్నారు. ఇలాంటింది ఇది తెలుగు సినిమా కాదని చెప్పడం దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాత తగదు.
అసలు బంద్ అనేది సమస్యలు పరిష్కార మార్గం కాదనే సమాధానం అన్ని చోట్ల వినిపిస్తుంది. బంద్ చేసి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పిన దిల్ రాజు.. ఇప్పుడు ఆయనే షూటింగులు జరపడం చూస్తుంటే.. అసలు సమస్యల పరిష్కారం పై చిత్తశుద్ధి ఉందా లేదా ? అనే ప్రశ్న తలెత్తుతుంది.