ఇప్పటికే పండుగల్లోకి అధికార పార్టీలు అవసరానికి మించి ప్రవేశించేశాయి! పండుగల పేరుతో ఉత్సవాలకూ ఉత్సాహాలకు ప్రత్యేకంగా నిధులు విడుదల చేయడం, కానుకలు అంటూ పథకాలను ప్రవేశపెట్టడాలు చేస్తున్నాయి. పైపైకి ఇవి బాగానే కనిపించొచ్చు. కానీ, క్షేత్రస్థాయికి వెళ్లేసరికి.. అధికార పార్టీకి చెందిన ప్రజలు చేసుకునే పండుగలకూ, ఆ పార్టీకి చెందినవారు జరుపుకునేదానికీ చాలా తేడా ఉంటోంది. ఆంధ్రాలో సంక్రాంతి విషయానికి వచ్చేసరికి ఇదే పరిస్థితి. పండుగ కానుకలు అంటూ కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. అవి చాలవన్నట్టుగా.. పండుగలూ సంప్రదాయం పేరుతో కోడి పందాల విషయంలో కూడా కొంతమంది నాయకుల చేస్తున్న ప్రకటనలు కాస్త ఆశ్చర్యంగా ఉన్నాయి.
సంక్రాంతి వస్తోందంటే ఆంధ్రాలో కోడి పందాల జోరు తెలిసిందే. దాదాపు నెల రోజుల ముందు నుంచే హడావుడి మొదలైపోతుంది. కొన్నాళ్ల కిందట కోడి పందాలు అంటే కొంత గోప్యత, పోలీసులు అడ్డుకుంటారేమో, నాయకులు వ్యతిరేకిస్తారేమో అనే బెరుకు ఉండేది. కానీ, రానురానూ అది పోతోంది. దీనికో సంప్రదాయ ట్యాగ్ తగిలించేస్తున్నారు. ప్రతీయేటా కోర్టు ఏం చెబుతుందా అనే కొంత పక్కబెదురు పందెం రాయళ్లలో ఉండేది. కానీ, ఈ సంవత్సరం కోడి పందాలకు నేతలే మద్దతుగా నిలవడం కనిపిస్తోంది. ఈ సంక్రాంతికి కోడి పందాలు ఉంటాయంటూ ఈ మధ్యనే ఏపీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప చెప్పడం కొంత సంచలనమైన సంగతి తెలిసిందే.
ఇక్కడితో ఆగకుండా కొందరు ఎమ్మెల్యేలు కూడా పందెం రాయళ్లకు మరింత భరోసా కల్పిస్తున్నారు. గురువారం నాడు భీమవరం సమీపంలో జరిగిన ఓ స్థానిక సమావేశంలో భీమవరం ఎమ్మెల్యే అంజిబాబుతోపాటు ఉండి ఎమ్మెల్యే శివరామరాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోడిపందాల ప్రస్థావనకు వస్తే… బెంగపడాల్సిన అవసరం లేదనీ, కొందరు చేస్తున్న ప్రచారం అసత్యమంటూ చెప్పారు. మన సంప్రదాయానికి తగ్గట్టుగానే పందాలు ఉంటాయని భరోసా కల్పించారు. ఈ వేడుకలకు అండగా ఉంటామన్నారు. పండుగల వరకూ ఓకేగానీ.. కోడి పందాల నిర్వహణ విషయంలో కూడా ప్రజాప్రతినిధుల జోక్యం.. అండగా నిలుస్తామంటూ భరోసా ప్రకటనలు చేయడం మరీ అతిగా అనిపిస్తోంది. వీటిని సంప్రదాయం గాటన కట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ సమస్య సంప్రదాయంతో కాదు.. రెండు మూగ జీవాలను పందెం పేరుతో హింసించడం, అదే పందెం పేరుతో బెట్టింగులు, పెద్ద ఎత్తున జూదం అనేదే కదా సమస్య. అంతేగానీ, పందాలకు దించిన కోళ్లను చూస్తూ హారతులిచ్చి, బొట్లు పెట్టి పూజలు చేసి ఒబ్బిడిగా జనం కూర్చోరు కదా! ఇలాంటి అంశాల్లోకి మంత్రులూ ప్రజాప్రతినిధులు ప్రవేశించేసి… నిర్వహణా బాధ్యతలు తమవి అన్నట్టుగా నెత్తినేసుకోవడం ఎంతవరకూ కరెక్ట్ చెప్పండీ..?