ఈ మధ్య టీవీ ఛానెళ్ల పరుగంతా శ్రీరెడ్డి వెనకే ఉంది! ఆమె ఎక్కడ ప్రెస్ మీట్ పెడుతుందీ, కొత్తగా ఏం చెబుతుందీ, ఎవరి చాటింగ్ రిలీజ్ చేస్తుందీ, ఆమెకి మద్దతుగా కొత్తగా ముందుకు ఎవరొస్తున్నారూ, వారు ఎవరిపై ఆరోపణలు చేస్తారూ… దాదాపు ఇలాంటి అంశాల చుట్టూనే కొన్ని టీవీ ఛానెళ్లు వెంపర్లాడుతున్నాయి. సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సమస్య మరీ ఇంత తీవ్రంగా ఉందా, ఉంటే ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఈ క్రమంలో మా ఏం చెయ్యాలి.. ఇలాంటి చర్చా కార్యక్రమాలకే కొన్ని చానెళ్లు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఇన్ స్టంట్ జడ్జిమెంట్లు కూడా ఇచ్చేస్తున్నాయి. ఇవ్వొద్దని చెప్పడం లేదుగానీ.. ఇదొక్కటే సమస్య కాదు కదా! అన్నింటికీ ప్రాధాన్యత ఉండాలి కదా. రాష్ట్రంలో చోటు చేసుకునే కీలక రాజకీయ పరిణామాలపై సమగ్ర విశ్లేషణలు, చర్చా కార్యక్రమాలు, నిపుణుల అభిప్రాయాలు లాంటివి ఈ మధ్య బాగా తగ్గిపోయాయి. శ్రీరెడ్డి చుట్టూనే చర్చలన్నీ. ఇదే అంశం చర్చించడానికి నయా విశ్లేషకులు తెరమీదికి వచ్చేస్తున్నారు!
ఆంధ్రా రాజకీయాల్లో ప్రస్తుతం ప్రత్యేక హోదా అంశం అత్యంత కీలకమైందిగా మారింది. పార్లమెంటు సమావేశాలు నిరవధికంగా వాయిదాపడ్డాక అధికార, ప్రతిపక్షాలు రాష్ట్ర స్థాయిలోనే ఉద్యమిస్తున్నాయి. ఒకరు బంద్ కి మద్దతు ఇస్తే, మరొకరు సైకిల్ యాత్రలు చేస్తున్నారు. ఇంకోపక్క.. రాజధాని పరిసర ప్రాంతాల్లోకి జగన్ పాదయాత్ర ప్రవేశించిన దగ్గర నుంచీ జన సందోహం పెరిగింది. శనివారం నాడు కృష్ణా వంతెన కిక్కిరిసింది. ఆదివారం నాడు ముత్యాలంపాడు క్రాస్ తదితర ప్రాంతాల మీదుగా జగన్ పాదయాత్ర సాగింది. కోస్తాంధ్ర జిల్లాల్లోకి పాదయాత్ర ప్రవేశించిన దగ్గర నుంచీ వైకాపా శ్రేణులు వ్యూహాత్మకంగానే జన సమీకరణపై ప్రత్యేక దృష్టిపెట్టినట్టున్నాయి. గుంటూరు, కృష్ణా జిల్లాలు అత్యంత కీలకం కాబట్టి… టీడీపీకి బాగా పట్టున్న ప్రాంతాలు కాబట్టి, ఇక్కడ జగన్ పాదయాత్రను భారీ సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో జన సమీకరణ జరుగుతున్నట్టు కథనాలున్నాయి.
ఈ క్రమంలో సోషల్ మీడియాలో వైకాపా అత్యుత్సాహం కూడా చూశాం. తెర వెనక ఏం జరుగుతున్నా… టీడీపీకి బాగా పట్టుంది అనుకునే జిల్లాల్లో జగన్ పాదయాత్రకు పెద్ద ఎత్తున జనం తరలి వస్తున్నారు. ఈ పరిణామాలను మీడియా సమగ్రంగా విశ్లేషించలేకపోతోంది. నిపుణులతో చర్చలు నిర్వహించలేకపోతోంది. దీంతోపాటు, ప్రత్యేక హోదా ఉద్యమ తీరుపై కూడా దశా దిశా ఏంటనేది సామాన్యులకు అర్థం కాని విషయంగా మారింది. కేంద్రం ఇవ్వదని తేలిపోయింది. టీడీపీ, వైకాపాలకు ఇదో ఎన్నికల ప్రచారాంశంగా మారిపోయింది. ఈ క్రమంలో పవన్ కల్యాణ్ పాత్ర ఏంటో అర్థం కావడం లేదు. ప్రత్యేక హోదాని ఎన్నికలు పూర్తయ్యే వరకూ మరచిపోవాల్సిందేనా..? కొత్త ప్రభుత్వాలు వస్తే తప్ప సాధ్యం కాదా..? ఈలోగా ఏపీ ప్రజల సెంటిమెంట్ ఏమౌతుంది..? ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. దీనిపై కూడా విస్తృత చర్చలు టీవీ చానెళ్లలో కనిపించడం లేదు. ఓవరాల్ గా టీవీ మీడియాలో కనిపిస్తున్న ట్రెండ్ ఏంటంటే.. రచ్చకే ప్రాధాన్యత! ఆ తరువాతే, రాష్ట్ర సమస్యలైనా వాటిపై విశ్లేషణలైనా.