హీరో, నిర్మాత.. ఎవరైనా సరే, అంతిమంగా నమ్మాల్సింది దర్శకుడినే. ఎందుకంటే ఆయనే కెప్టెన్ ఆఫ్ ది షిప్ కాబట్టి. ఏదో కొత్త దర్శకుడు వచ్చాడు, సినిమా ఎలా తీస్తాడో తెలీదు అని బెంగేస్తే మాత్రం స్టీరింగ్‌ని చేతుల్లోకి తీసుకోవాల్సిందే. ఈ విషయంలో నాగార్జున చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో సినిమా అనగానే నాగ్ చాలా అప్రమత్తంగా ఉంటాడు. సోగ్గాడే చిన్ని నాయిన, రారండోయ్ వేడుక చూద్దాం ఇలాంటి సినిమాల్ని అచ్చంగా తన ‘డైరక్షన్’లోనే నడిపించుకున్నాడు. ఎడిటింగ్ రూమ్‌లో సినిమాని చూసి, తనవైన మార్పులు చేర్పులూ చేసి అందుకు తగిన ఫలితాన్ని కూడా రాబట్టుకున్నాడు.
ఇప్పుడు విక్రమ్ కె.కుమార్ విషయంలోనూ అంతే ఇన్వాల్వ్ అవుతున్నాడు. నిజానికి విక్రమ్ మిస్టర్ పర్ఫెక్ట్లాంటి దర్శకుడు. తనకే ఏదీ ఓ పట్టాన నచ్చదు. ప్రతీ సీన్ విషయంలోనూ చాలా కేర్‌ఫుల్‌గా ఉంటాడు. అలాంటి దర్శకుడి పనిలో జోక్యం చేసుకోవడం నాగ్ లాంటి వాడిని ఏమాత్రం సబబు?? ‘మనం’ లాంటి హిట్ ఇచ్చాక, విక్రమ్ కె.కుమార్ కెరీర్ గ్రాఫ్ తెలిశాక అతన్ని మిగిలిన దర్శకుల్లానే ట్రీట్ చేయడం ఏమిటన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ‘మనం’కి సంబంధించిన టీజర్లు, ట్రైలర్లు, ఒక నిమిషం పాటల వెనుక నాగార్జున ఆలోచనలు మాత్రమే ఉన్నాయని, ఈ ట్రైలర్లు టీజర్లకూ విక్రమ్‌కీ ఎలాంటి సంబంధం లేదని తెలుస్తోంది. ‘ఎడిటింగ్ రూమ్ తాళాలు నా దగ్గరే ఉంటాయి కదా’ అంటూ ఓ ప్రెస్ మీట్లో.. ఈ సినిమా విషయంలో తాను ఎంతగా ఇన్వాల్వ్ అయిపోయాడో చెప్పేశాడు నాగ్. విక్రమ్ ఈ విషయంలో కాస్త కినుకగా ఉన్నట్టు పరిశ్రమలో చెప్పుకుంటున్నారు. ఈ సినిమా ఎప్పుడు పూర్తవుతుందా, ఎప్పుడు బయటపడదామా అని విక్రమ్ భావిస్తున్నాడని చెప్పుకుంటున్నారు. ఈ ఎఫెక్ట్ రాబోయే నాగచైతన్య సినిమాపై పడొచ్చు. నాగచైతన్య – విక్రమ్ ల కాంబోలో నాగ్ ఓ సినిమాని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి ‘ఓకే’ అనేసిన విక్రమ్.. ఇప్పుడు ఈ కాంబినేషన్‌పై పునరాలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ‘నాకు ఫ్రీ హ్యాండ్ ఇస్తే తప్ప ప్రాజెక్టు చేయలేను’ అని ముందుగా మాట తీసుకొని అప్పుడు రంగంలోకి దిగాలని విక్రమ్ భావిస్తున్నాడట. తనయుల సినిమాల విషయంలో నాగ్ కేర్ తీసుకోవడం మంచిదే, కానీ విక్రమ్ లాంటి దర్శకుడ్ని పెట్టుకుని మరీ ఇలాంటి చాదస్తాలకు పోవడం మాత్రం కరెక్ట్ కాదు. ఏమంటారు..??