నంది అవార్డులు… దాని చుట్టూ రేగిన వివాదాలు ఇప్పట్లో మర్చిపోయేవి కావు. ఇది నంది అవార్డు కాదు.. ‘కమ్మ’ అవార్డు అని బహిరంగంగానే విమర్శించిన వాళ్లున్నారు. ఏపీ ప్రభుత్వం కమ్మవాళ్లకే కాపు కాస్తుందని దుమ్మెత్తిపోసిన వాళ్లెంతమందో..?? ఆశించిన అవార్డులు రాని కాంపౌండ్‌లో కొంతమంది లోలోపల ఉడుక్కుంటే, ఆ అక్కసుని కొంతమంది మీడియా ముఖంగానే వెళ్లగక్కేశారు. అందులో బన్నీ వాసు అండ్ కో కూడా ఉంది. ఎప్పుడూ లేనిది టీవీలకెక్కి… నంది అవార్డులు ‘పంచిన’ తీరుపై ఘాటైన విమర్శలు చేశారు. ఆ రోజున.. ప్రభుత్వ నిర్వాకం కూడా అలానే ఏడ్చింది కాబట్టి బన్నీ వాసు చెప్పినదాంట్లో కనీసం సగమైనా నిజం కనిపించింది.
కాలం గిర్రున తిరిగింది. ఇప్పుడు ‘కాపు’ వాళ్లకు ‘కాపు’ కాచే సమయం వచ్చింది. ‘అజ్ఞాతవాసి’ ప్రీమియర్ షోలకు. బెనిఫిట్ షోలకు ఏపీ ప్రభుత్వం అనుమతులు ఇచ్చేసింది. అర్థరాత్రి నుంచి మరుసటి రోజు ఉదయం 10 గంటల వరకూ నాన్ స్టాప్‌గా ఎన్ని షోలు పడితే అన్ని షోలు వేసుకోవొచ్చన్నది ఏపీ ప్రభుత్వ నిర్ణయం. అంటే 9వ తేదీ రాత్రి 12 గంటల నుంచి పవన్ సినిమా ప్రభంజనం మొదలైపోతుందన్నమాట. తొలి రోజు రికార్డులు కుమ్ముకోవడానికి ఇంతకంటే మార్గం ఉందా?? దాంతో పవన్ అభిమానులు ఖుషీ అయిపోతున్నారు. కాకపోతే… బన్నీ వాసు అండ్ కో.. ఇలాంటి సమయంలో నోళ్లు మెదుపుతారా? అనేదే పెద్ద ప్రశ్న. మరి పనవ్ కల్యాణ్‌ది ఏ కులం?? ఏపీ సర్కార్ ఇప్పుడు ‘కాపు’వాళ్లని కాపు కాచినట్టు కదా? ప్రీమియర్ షోలకు పర్మిషన్ ఇంతకు ముందు ఇంతే భారీగా ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడే ఎందుకు ఇచ్చారు? అదంతా పవన్‌పై అభిమానమా? భక్తా? భయమా? ఎలాగూ పవన్ ఎక్కేది సైకిలే కదా అని… ముందు జాగ్రత్తగా ప్రీమియర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా? ‘పర్మిషన్లు కాపు వాళ్లకేనా. మిగిలిన వాళ్లకూ ఉంటాయా’ అంటూ ఇలాంటి సమయంలో బన్నీ వాసులాంటి వాళ్లు గళం విప్పితే.. ఆ మిగిలిన వాళ్లకూ మంచి జరుగుతుంది కదా??