– ఓ గీత చిన్నగా కనిపించాలంటే దానిపక్కన ఓ పెద్ద గీత గీస్తే చాలు!
– ఓ తప్పు చిన్నగా కనిపించాలంటే అంతకంటే పెద్ద తప్పు జరిగిందని వీలైనంత ఎక్కువ ప్రచారం చేయాలి!
– మనం మంచోళ్ళు అనిపించుకోవాలంటే ఎదుటివాళ్ళు చెడ్డోళ్ళు అని నిరూపించాలి!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన సాక్షి పత్రికలో ఈ రోజు ప్రచురితమైన రామ్ గోపాల్ వర్మ ఇంటర్వ్యూ చదివితే అటువంటి అభిప్రాయాలే కలుగుతాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబునాయుడును ఎదుర్కొనలేక, ఆయన్ను బదనాం చేయడానికి వర్మ చేత ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీయిస్తున్నారా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణ తండ్రి బయోపిక్ తీస్తుంటే… కేవలం లక్ష్మీ పార్వతి ఎపిసోడ్ మాత్రమే వర్మ తీయాలనుకోవడం వెనుక ఉద్దేశం ఏంటో అందరికీ అర్థమైంది. వైఎస్సార్సీపీ నాయకుడు రాకేశ్‌రెడ్డి నిర్మాత కావడంతో జగన్మోహన్రెడ్డి పార్టీ మనుషులు పనిగట్టుకుని సినిమా తీస్తున్నారని సర్వత్రా కామెంట్స్ వినిపించాయి. తిరుపతిలో జరిగిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మనుషులు ఈ చిత్రానికి దూరంగా వుంటే మంచిదని వర్మ వ్యాఖ్యానించారు. ఒక శత్రువు మరో శత్రువు గురించి చెబితే ఎవరూ నమ్మరని, రాకేశ్‌రెడ్డి వైఎస్సార్ పార్టీ మనిషి అనే సంగతి తనకు ముందుగా తెలియదని ఆయన పేర్కొన్నారు. ఈ మాటలు మాట్లాడిన రెండు రోజులకు ‘సాక్షి’ పత్రికలో వర్మ ఇంటర్వ్యూ వచ్చింది. ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గురించి వర్మను పలు ప్రశ్నలు అడిగారు. అందులో కొన్ని ప్రశ్నలు తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉండటం గమనించదగ్గ విషయం!!
‘ఎన్టీఆర్‌ని వెన్నుపోటు పొడిచారనే అభిప్రాయం కొందరిలో ఉంది. మీ అభిప్రాయం?’ అని వర్మను ప్రశ్నించగా… ‘అవును. వెన్నుపోటు పొడిచారు’ అని ఆయన జవాబు ఇచ్చారు. ఈ ప్రశ్నకు మాత్రమే కాదు… పలు ప్రశ్నలకు వర్మ సమాధానాలు ఫక్తు ప్రతిపక్ష నాయకుల మాటలను తలపించాయి. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ ప్రతిపక్ష నాయకులు చేసే విమర్శల్లో ‘ఎన్టీఆర్‌ని సొంతవాళ్ళు వెన్నుపోటు పొడిచారు’ అనేది తప్పకుండా ఉంటుంది. దాన్నే వర్మ చేత ఇంటర్వ్యూలో మరోసారి చెప్పించినట్టు వుంది. సాధారణంగా చనిపోయినవాళ్ళల్లో మంచోళ్ళు స్వర్గానికి వెళతారని, తప్పులు చేసినవాళ్ళు నరకానికి వెళతారని హిందువులు విశ్వసిస్తారు. వర్మ సమాధానాల్లో ‘స్వర్గంలో ఉన్న ఎన్టీఆర్’ అని ఎక్కువసార్లు ధ్వనించడంతో ‘ఎన్టీఆర్ పేరు పలికినప్పుడల్లా స్వర్గంలో వున్నారని అంటున్నారు. ఆయన స్వర్గంలో వున్నారని మీకెలా తెలుసు?’ అని ప్రశ్నించారు. ఈ ప్రశ్న ఉద్దేశం ఏంటి? ఎన్టీఆర్ నరకంలో వున్నారని వాళ్ళు అభిప్రాయమా?? ఇటువంటి సందేహాలు ఎన్నో!!
వైఎస్సార్సీపీ మనుషులు ఈ చిత్రానికి దూరంగా వుండాలని చెప్పి వారం రోజులు గడవక ముందే వైఎస్సార్సీపీ పత్రిక వాళ్ళు సంప్రతిస్తే.. ఇంటర్వ్యూ ఇవ్వడంలో, సినిమా ప్రచారానికి జగన్మోహన్రెడ్డి పత్రికను ఉపయోగించుకోవడంలో వర్మ అంతర్యం ఏంటి? లేదు లేదు అంటున్నా… సినిమా వెనుక వాళ్ళు వున్నారని చెప్పడమా?? చూస్తుంటే ఈ సినిమాకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ టైటిల్ కంటే ‘సాక్షీస్ ఎన్టీఆర్’ టైటిల్ కరెక్టుగా సూటవుతుందని అనిపిస్తోంది. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి నందమూరి కుటుంబీకుల తప్పులను వేలెత్తి చూపించడం కోసం వర్మ చేత ప్రతిపక్ష పార్టీ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరపైకి తీసుకురావడానికి కృషి చేస్తుందని ప్రజల్లో పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.