తమిళనాడులో మద్యం స్కాం జరిగిందని ఈడీ దాడులు చేసింది. మూడు, నాలుగు రోజుల పాటు సోదాలు చేసి వెయ్యి కోట్ల స్కాం జరిగిందని.. ఒక్కో బాటిల్ కు పది నుంచి ఇరవై రూపాయల చొప్పున వసూలు చేశారని గుర్తించారు. ఆ సొమ్ము రాజకీయనేతలకు చేరిందన్న అనుమానాలను కూడా ఈడీ వ్యక్తం చేసింది. తద్వారా తమ టార్గెట్ ఎలా ఉంటుందో చెప్పకనే చెప్పారు.
అయితే ఇంత హడావుడి చేస్తున్న ఈడీకి ఏపీలో అత్యంత అరాచకంగా సాగిన మద్యం పాలసీ స్కాంను ఎందుకు పట్టించుకోవడంలేదన్న ప్రశ్న వస్తోంది. చంద్రబాబునాయుడు చాలా రోజుల క్రితమే .. అసెంబ్లీలో మద్యం స్కాంను సీఐడీ చేత దర్యాప్తు చేస్తున్నామని.. వేల కోట్ల లావాదేవీలు నగదు రూపంలో జరిగాయి కాబట్టి ఈడీకి కూడా సిఫారసు చేస్తున్నామన్నారు. ఆ తర్వాత టీడీపీ నేతల నుంచి.. సీఐడీ నుంచి మద్యం స్కాంలో మనీ రూటింగ్ ఎలా జరిగిందో వివరిస్తూ పూర్తి ఆధారాలతో కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈడీకి వివరాలిచ్చారు. అయినా ఇంత వరకూ రంగంలోకి దిగలేదు.
సీఐడీ విచారణలో రాజ్ కసిరెడ్డి అనే వ్యక్తి ఎలా దందా నడిపారో .. నగదు రూపంలో వసూలు చేసిన డబ్బులన్నీ ఎవరికి చేరాయో కనిపెట్టారని చెబుతున్నారు. అలాంటి సమయంలో ఈడీ లాంటిదర్యాప్తు సంస్థలు ముందుకు వచ్చి ఈ వేల కోట్ల వ్యవహారాన్ని తేల్చాల్సి ఉంది. కానీ టార్గెటెడ్ గా కొన్ని రాష్ట్రాలకు వెళ్తున్నారు కానీ.. అసలు భయంకరమైన నేరం జరిగిన చోటకు మాత్రం రావడం లేదు. ఫలితంగా నేరస్తులు హాయిగా తిరుగుతున్నారు.