రాజమౌళి అన్నా, ఆ కుటుంబం అన్నా `ఈనాడు` ప్రత్యేకమైన అభిమానాన్ని చూపిస్తుంది. `బాహుబలి` సినిమాకి ఈనాడు ఇచ్చిన కవరేజ్ అంతా ఇంతా కాదు. ప్రతి చిన్న విషయాన్నీ హైలెట్ చేసేది. రాజమౌళి ఇంటర్వ్యూనైతే ఫుల్ పేజీ ప్రచురించింది. ఓ సెలబ్రెటీ ఇంటర్యూకి ఫుల్ పేజీ కేటాయించడం ఈనాడు ప్రమాణాలకు పూర్తి విరుద్ధం. అప్పటి వరకూ ఈనాడు చరిత్రలోనే అలా జరగలేదు. `బాహుబలి` విడుదలయ్యాక రివ్యూ కూడా ఇచ్చాడు. ఎప్పుడూ రివ్యూల జోలికి వెళ్లని ఈనాడు బాహుబలికి మాత్రం పనిగట్టుకుని రివ్యూ ఇవ్వడం, ఆ తరవాత రివ్యూల్ని ఆపేయడం ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే అదే `ఈనాడు` ఇప్పుడు RRR ని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. అందరిలానే చిన్న చిన్న ఐటెమ్స్ , అప్ డేట్స్ తో సరిపెట్టేస్తోంది. ఒక్కోసారి అదీపట్టించుకోవడం లేదు. దానికి తెర వెనుక కారణాలున్నాయన్నది ఇండ్రస్ట్రీ వర్గాల టాక్. `బాహుబలి` షూటింగ్ అంతా అప్పుడు రామోజీ ఫిల్మ్‌సిటీలోనే సాగింది. అక్కడే సెట్లు వేశారు. రెండు భాగాల సినిమా మొత్తం రామోజీ ఫిల్మ్‌సిటీలోనే తీశారు. రాజమౌళి కుటుంబం అంతా ఆర్.ఎఫ్.సీలోనే బస వేసింది. వీటన్నింటికి దాదాపు రూ.90 కోట్ల బిల్లు వేసింది రామోజీ ఫిల్మ్‌సిటీ. ఈ మొత్తాన్ని సినిమా బిజినెస్ జరిగాక…. చెల్లించింది చిత్రబృందం. దానికి తోడు.. లాభాల్లో వాటా కూడా ఇచ్చార్ట. అందుకే బాహుబలిని అంతలా మోసింది ఈనాడు సంస్థ. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ విషయంలో అది జరగడం లేదు. ఈ సినిమాకి సంబంధించిన ఒక్క సీన్ కూడా ఫిల్మ్‌సిటీలో తీయలేదు. అందుకే ఈ సినిమాకి ప్రచారం కల్పించడానికి ఈనాడు ఏమంత ఉత్సాహం చూపించలేదని టాక్. ప్రస్తుతం ప్రభాస్ – నాగ అశ్విన్ ల సినిమా `ప్రాజెక్ట్ కె` ఫిల్మ్‌సిటీలోనే జరుగుతోంది. సినిమా షూటింగ్ దాదాపుగా ఫిల్మ్‌సిటీలోనే చేస్తారని టాక్. కాబట్టి.. బాహుబలిలానే ప్రాజెక్ట్ కెకి కూడా భారీ ప్రచారం కల్పించాలని ఈనాడు భావిస్తోందట. రామోజీ ఫిల్మ్‌సిటీలో షూటింగ్ జరిపితే ఒకరకమైన ప్రచారం.. లేదంటే.. మరో రకమైన పబ్లిసిటీ. ఇది ఈనాడు కొత్త రూలుగా మారిపోయిందిప్పుడు.