స్వచ్చంద పదవి విరమణ చేసి.. రాజకీయ రంగ ప్రవేశం కోసం.. ఏర్పాట్లు చేసుకున్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ.. గత కొంత కాలంగా సైలెంట్‌గా ఉంటున్నారు. హైదరాబాద్‌లో.. ఓ సారి శ్రేయోభిలాషులతో సమావేశం పెట్టారు. ఆ సమయంలో ఆయన లోక్‌సత్తా బాధ్యతలు తీసుకుంటారన్న ప్రచారం జరిగింది. కానీ.. ఆయన ఆ తర్వాత లోక్‌సత్తా జోలికి పోవడం లేదని.. సొంతంగా రాజకీయ కార్యాచరణ ఉందని.. అ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. ఆ తర్వాత ఇంత వరకూ…వీవీ లక్ష్మినారాయణ.. రాజకీయాలపై ఎలాంటి ప్రకటనలు చేయలేదు. కానీ.. తన భావజాలానికి దగ్గరగా ఉండే సదస్సులు, సమావేశాలకు ఎవరైనా పిలిస్తే వెళ్తున్నారు. మాట్లాడుతున్నారు.. కానీ అక్కడ రాజకీయ అంశాలు ప్రస్తావించడం లేదు.
రాజకీయాలపై ఎంతో ఆసక్తిగా ఉన్న ఆయన… రెండు నెలల పాటు.. ఏపీ మొత్తం పర్యటించి.. తన రాజకీయ పార్టీకి కావాల్సిన మేనిఫెస్టోకు అవసరమైన విషయాలు సేకరించారు. ఈ మేరకు ఓ నివేదిక సిద్ధం చేసుకున్నారు. కానీ ఆ తర్వాత కార్యాచరణ విషయంలో మాత్రం వెనుకబడిపోయారు. పకడ్బందీగా అడుగులు వేయడంలో ఆయనకు సరైన రాజకీయ అనుభవం లేకపోవడంతో.. ముందుకు పోలేకపోయారన్న ప్రచారం జరిగింది. సొంత పార్టీనా.. రాజకీయ పార్టీల్లో చేరుతారా.. అన్నదానిపై మొదటి నుంచి ఆయన గందరగోళ సమాధానాలే చెప్పారు. ఈ విషయంలో మొదట్లోనే క్లారిటీ ఇచ్చి .. తనకు ఇష్టమైన పార్టీని ఎంపిక చేసుకుని ఉంటే.. ఈ పాటికి.. రాజకీయం ఒంటబట్టి ఉండేది. కానీ.. గత ఉద్యోగపు ఇమేజ్ ఆయనను వెంటాడుతూనే ఉంది. అందుకే ఆయన తేల్చుకోలేకపోతున్నట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లోకి అడుగు పెట్టాలనుకున్న తర్వాత.. ఏమి చేసినా.. ఏమి చేయకపోయినా విమర్శలు వస్తాయి. అవి కామన్. వాటిని లెక్కలోకి తీసుకుంటే.. ఏ ఒక్క రాజకీయ నాయకుడు కూడా ప్రశాంతంగా ఉండలేరు. ఈ విషయంలో వీవీ లక్ష్మినారాయణ.. రియలైజ్ కాలేకపోతున్నారని చెబుతున్నారు. అందుకే.. ఎన్నికల ప్రకటన మరో రెండు, మూడు వారాల్లో వస్తుంది తేలిన తర్వాత కూడా.. ఆయన సైలెంట్‌గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో అడపా, దడపా ఆయన… ఫలానా పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. కానీ సీబీఐ మాజీ జేడీ వైపు నుంచి స్పందనలేదు. ఆయన తనకు ఇష్టమైన సామాజిక సేవ రంగంలోనే ఉండేందుకు ఏర్పాట్లు చేసుకుని ఉంటారని… ఈ సారి రాజకీయాల్లోకి రాకపోవచ్చని.. ప్రచారం జరుగుతోంంది.