* ప్రశాంత లౌకిక దేశంలో మతం చిచ్చు!
* ఈసారి 84 మంది హతం
ఐఎస్ఐఎస్ (ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా) కీలక నాయకుడు, ఒమర్ అల్ షిసానీని ఇరాక్ లో విమానదాడిలో చంపేసినట్టు అమెరికా ప్రకటించిన 24 గంటల్లో అదే సంస్థ మళ్లీ ఫ్రాన్స్‌లో నరమేధం సృష్టించింది. ఒమర్ వధకు ప్రతీకారమా అన్నట్టు ఫ్రాన్స్‌లో కిరాతకంగా ట్రక్కు దాడి జరిగింది.
1789 ఫ్రెంచి విప్లవంతో ప్రపంచానికి స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వాలను ప్రపంచ ప్రజాస్వామ్యానికి ఇచ్చిన ఫ్రాన్స్ దేశంలో ఉగ్రవాద దాడులు జరుగుతూనే ఉండటం విచారకరం.
ఫ్రెంచ్ విప్లవ దినోత్సవం ప్రారంభమైన రెండు రోజులకు బాస్టిల్ డే జరుపుకుంటారు. ప్రజలు తమ ఐక్యతను చాటి చెప్పేందుకు నిర్వహించుకునే జాతీయ దినోత్సవం- బాస్టిల్ డే. ఆరోజు “నీస్” నగరంలో సైనిక కవాతు జరుగుతుంది. రెండు రోజుల ఈ పండుగ చివరి రోజున రాత్రి బాణసంచా కాల్చి ముగిస్తారు. బాణాసంచాను ప్రజలు చూస్తున్న సమయంలోనే ఉగ్రవాది ఒకడు ట్రక్కుదాడి జరిపాడు. ట్రక్కు అధిక వేగంగా పాదచారుల వంతెనపై నుంచి ప్రజలపైకి దూసుకెళ్లింది. భద్రతాదళాలు కాల్పులు జరిపినా ఆ ట్రక్కు ఆగలేదు. ట్రక్కు నుంచి ఉగ్రవాది కాల్పులు కూడా జరిపాడు. ఒక్క ఉగ్రవాది సృష్టించిన కలకలంతో ఆ ప్రాంతమంతా 84 మంది అమాయకులు చెల్లాచెదరుగా శవాలై పడివున్న భయానక వాతావరణం నెలకొంది.
క్రైస్తవులు ఎక్కువగా ఉన్న దేశమైనా లౌకిక రాజ్యంగా భాసిల్లుతున్న ఫ్రాన్స్‌లో 2003 నుంచి ముస్లింల జనాభా పెరిగిపోతూ వచ్చింది. ఏ మతానికి చెందిన వారైనా కూడా ఆ మతానికి చెందిన వారుగా తెలిపే దుస్తులు వేసుకోరాదని చట్ట సవరణ చేసుకుని మరీ ఫ్రాన్స్ పాలకులు సర్వమత సమానత్వాన్ని పాటిస్తున్నారు. రోమన్ కాథలిక్లు ఎక్కువగా ఉండే ఫ్రాన్స్‌లో ఏ మతానికి చెందని వారుగా 28 శాతం మంది ప్రకటించుకున్నారు. ముస్లింలతో బాటు సిక్కులు, యూదులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు కానీ ముస్లింలు తరచూ తమ మతాన్ని తెలిపే దుస్తులు వేసుకోవడం లేదా తమ మతానికి చెందిన జెండాలను ఎగురవేయడం ద్వారా చట్టాన్ని ఉల్లంఘిస్తున్నారు.
60 లక్షల మంది అంటే జనాభాలో 10 శాతం మంది ముస్లింలు అక్కడ నివశిస్తున్నారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అక్కడి మతఛాందస భావాలను రెచ్చగొట్టడానికి ఎప్పుడూ ఒక వర్గం సిద్ధంగా ఉండేది. ప్రశాంతమైన లౌకిక దేశంలో తరచూ మతం చిచ్చు పెడుతూనే ఉంది.
2015 జనవరి 7వ తేదీన ఫ్రాన్స్‌లోని చార్లీ హెబ్డో వార పత్రిక కార్యాలయంపై ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కాల్పులు జరిపి 12 మందిని హతమార్చారు. మొహమద్ ప్రవక్తపై వ్యంగ్య చిత్రాలను ప్రచురించడం ఆ పత్రిక తప్పు. చార్లీ హెబ్డో పత్రిక కార్యాలయంపై దాడి జరిగిన రెండో రోజు అక్కడి మసీదులపై స్థానికులు ప్రతిదాడులు జరిపారు. అప్పటి నుంచి అక్కడ మతం మండుతూనే ఉంది.
ఇరాక్, సిరియా తదితర దేశాల్లో అమెరికా నేతృత్వంలో జరుగుతున్న ఉగ్రవాద వ్యతిరేక దాడుల్లో ఫ్రాన్స్ దళాలు పాల్గొంటున్నాయి. ఫ్రాన్స్ దళాలు చేస్తున్న పని వల్ల చాలా వరకు ఉగ్రవాదుల శిబిరాలు తుడిచిపెట్టుకుపోతున్నాయి. దీంతో ఫ్రాన్స్ దేశం ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల లక్ష్యంగా మారింది.
ఇస్లామిక్‌స్టేట్‌లో చేరేందుకు యూరప్ నుంచి అనేక మంది యువత వెళ్లారు. మరో వైపు వందలాది ముస్లిం యువకులు ఫ్రాన్స్ నుంచి ఇరాక్, సిరియాలకు తరలివెళ్లినట్లు నిఘావర్గాలు హెచ్చరిస్తూ వచ్చాయి. వీరంతా జిహాద్ సాధించే లక్ష్యంతో ఐఎస్ఐఎస్కు సాయపడేందుకు వెళ్లారని కూడా ఫ్రాన్స్ ప్రభుత్వానికి తెలుసు. వీరిలో ఫ్రాన్స్ నుంచి వెళ్లినవారిదే కీలకపాత్ర.
ఇటీవల ఐరోపాకు ఉత్తర ఆఫ్రికా, సిరియాల నుంచి వలసలు అధికమయ్యాయి. వలసదారుల ముసుగులో ఉగ్రవాదులు కూడా ప్రవేశించినట్టు ఇప్పుడు జరిగిన ఈ సంఘటనతో స్పష్టమౌతోంది. గత కొద్ది కాలంగా ఇస్లామిక్ రాడికల్స్ అనే సంస్థ ఒకటి ఫ్రాన్స్‌లో చురుకుగా పని చేస్తున్నది. ఆఫ్ఘనిస్తాన్పై అమెరికా యుద్ధం చేసిన సమయంలో కూడా ఫ్రాన్స్ అమెరికాకు సాయపడింది. ఆ సమయంలో అల్‌ఖైదా ఉగ్రవాదులు ఫ్రాన్స్‌లో ఏడుగురు వ్యక్తుల్ని నిలబెట్టి కాల్చేసి ఫ్రాన్స్‌లో సంచలనం సృష్టించారు. 2012 నుంచి అల్‌ఖైదా ఉగ్రవాదులు తమ కార్యకలాపాలను ఫ్రాన్స్‌లో ఎక్కువ చేశారు. ఒక్క ఫ్రాన్స్‌లోనే కాదు అన్ని యూరప్ దేశాల్లో ఇదే విధమైన దాడులు జరుగుతాయని ఐఎస్ఐఎస్ ఇప్పటికే హెచ్చరించింది.