నేను మీకు పది లక్షలిచ్చా అని ప్రచారం చేసుకుంటే … నిజంగా ఇచ్చినట్లుగా కాదు. నిజంగా ఇస్తే ప్రచారం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తీసుకున్న వాడికి తెలుస్తుంది. అలా కాదు ఇవ్వకున్నా ఇచ్చినట్లుగా నమ్మిస్తే సింపుల్‌గా ఖర్చు లేకుండా పనైపోతుందని కొంత మంది మేధావులు నమ్మకంతో ఉంటారు. ఇలాంటి మేధావులు ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలో ఉన్నారు. లబ్ది చేకూరకపోయినా మీ బతుకులు మార్చేశామని నమ్మించడానికి … బయలుదేరారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రచార భేరి మోగించింది. తాము గొప్ప పనులు చేశామని ఆ పనులన్నింటికీ ప్రతీ గడపకు తీసుకెళ్లి చెప్పాలనుకుంటోంది. ఇందు కోసం రకరకాల పేర్లతో ఇంటింటికి వెళ్లాలని అనుకుంటోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు నెలల తరబడి గడప గడపకూ మన ప్రభుత్వం పేరుతో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్, జగనన్నే మా భవిష్యత్ అనే రెండు ప్రచార కార్యక్రమాలనూ ప్రారంభించాలని నిర్ణయించారు. వాలంటీర్లు, గృహసారధులు, సచివాలయ కన్వీనర్లు ఇలా రకరకాల పేర్లతో క్యాడర్ ను రెడీ చేసుకుని ముందుకెళ్తున్నారు. నిజానికి ఇలా ప్రతీ ఇంటికి వెళ్లడం ఎందుకు.. నిజంగానే పథకాలు పొంది ప్రజలు బాగుపడి ఉంటే.. ఓట్లు వేయరా .. అనే సందేహం సహజంగానే వస్తుంది.
కానీ ఏపీలో ప్రభుత్వ పథకాలు పొందిన వారిలో సంతృప్తి లేదు. ప్రభుత్వం వంద ఇచ్చి రూ. వెయ్యి లాక్కుందని ఎదురు లెక్కలు చెబుతున్నారు జనం. అందుకే ప్రచారంతో అందర్నీ నమ్మించాలని అనుకుంటున్నారు. దీనికి వ్యూహాలు ఖరారు చేస్తోంది ఐ ప్యాకే. జనంలో వ్యతిరేకత ను గుర్తించి.. నమ్మకం, విశ్వసనీయత అనేవి బొత్తిగా లేకుండా పోయాయని.. వాటిని పునరుద్ధరించడానికి స్టిక్కర్ల ఉద్యమం చేయాలని సలహా ఇచ్చారు. ఆ ప్రకారం పని ప్రారంభిస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం ఇలాంటి పాలన చేసి.. ఇంటి ముందు స్టిక్కర్లు అంటిస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
అసలు చేయాల్సిన పనులు చేయకుండా ఇలాంటి స్టిక్కర్ల పనులు పెట్టుకుంటే.. వ్యతిరేకత మరింత పెరుగుతుందనే చిన్న లాజిక్‌ను వైసీపీ మర్చిపోయింది. అధికార పార్టీకి పనితీరే పెద్ద ప్రచారం… దీన్ని నిర్లక్ష్యం చేసి పోస్టర్లు వేసుకుంటే… ప్రయోజనం ఏమీ ఉండదు.