కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారంలో విపక్షాల ప్రచారాన్ని అడ్డుకోవడంలోనే కాదు న్యాయస్థానాలకు సరైన సమాచారం ఇవ్వడంలోనూ తెలంగాణ ప్రభుత్వ యంత్రాంగం తీవ్రంగా విఫలమయింది. ఫేక్ ఫోటోలు, ఏఐ వీడియోలతో ఇష్టం వచ్చినట్లుగా ఏది నిజం.. ఏది అబద్దమో తెలియనంతగా జరిగిన తప్పుడు ప్రచారానికి తోడు అసలు ఆ భూమి అటవీ శాఖది.. హెచ్సీయూది అంటూ జరిగిన ప్రచారాన్ని కూడా తిప్పికొట్టలేకపోయారు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆ భూమిని అటవీ భూమిగా భావించింది. కానీ అది అటవీ భూమి కాదని.. వాణిజ్య అవసరాల కోసమే దశాబ్దాల కిందట కేటాయించిన స్థలం అని చెప్పుకోలేకపోయారు.
కంచ గచ్చిబౌలిలో భూముల అమ్మకం అనేది అసలు విషయం కాదు. ఎందుకంటే ఆ భూమిని 2003లోనే ఇతర సంస్థలకు కేటాయించారు. ఐఎంజీ-భరత అనే సంస్థకు ఇచ్చేసి ఉంటే.. ఇప్పటికే అక్కడ అతి పెద్ద స్పోర్ట్స్ కాంప్లెక్స్ వచ్చి ఉండేది. కానీ తర్వాత వచ్చిన వైఎస్ ప్రభుత్వం అందులో వాటాల కోసమో.. మరో దాని కోసమో కానీ వేధించారు. చివరికి కోర్టు కేసుల్లో పడింది. ఏళ్లకేళ్లు గడిచిన తర్వాత ఇప్పుడు తేలింది. ఇన్నాళ్లూ ఖాళీగా ఉండటంతో చెట్లు పెరిగాయి. కానీ వన్య ప్రాణులు ఎక్కడినుంచి వస్తాయి..?
అయితే చెట్లు పెరిగాయి కాబట్టి అది అటవీ భూమి అని ప్రచారం చేస్తున్నారు. చెట్లు కొట్టేస్తున్నారన్న ప్రచారం తో సుప్రీంకోర్టు కూడా అది అటవీ భూమి అనే అనుకుంటోందంటే ప్రచారం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నిజాన్ని చెప్పుకోలేకపోవడం ప్రభుత్వ వైఫల్యమే. మొదట హెచ్సీయూ భూములన్నారు..తర్వాత అటవీ భూమి అన్నారు. ఎలా అయినా ఆ భూముల్ని అమ్మకుండా చేయడం లక్ష్యం. దాన్ని దాదాపుగా సాధించారు. చుట్టూ కొండలు, గుట్టల్ని కొట్టేసి అమ్మేసిన వాటిలో భారీ ఆకాశహర్మ్యాలు ఉండగా. వాటి మధ్యలో … కోర్టుల్లో కేసుల్లో పడి చివరికి వినియోగంలోకి తెచ్చుకోవాల్సిన భూమి మాత్రం.. మళ్లీ కోర్టు కేసుల్లోకి వెళ్లిపోయింది. అది కూడా అవాస్తవ, అసహజ కారణాలతోనే.
కాంగ్రెస్ ప్రభుత్వం నిజాల్ని కూడా చెప్పుకోలేకపోతోంది. ఫేక్ ప్రచారాన్ని అడ్డుకోలేకపోతోంది. దానికి కంచ గచ్చిబౌలి భూముల్లో ప్రభుత్వపై పెరిగిన దాడే సాక్ష్యం.