ఆంధ్రప్రదేశ్లో మారిన పరిస్థితుల్లో కొత్తగా పుట్టుకొచ్చిన జాడ్యం ఆలయాలపై దాడులు. రధాలు తగుల బెట్టడం దగ్గర్నుంచి విగ్రహాల తలలు విరగ్గొట్టడం వరకూ పరిస్థితి వచ్చింది. పెద్ద ఎత్తున ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పటికీ నిందితుల్ని ఇంత వరకూ పట్టుకున్న పాపాన పోలేదు. అంతర్వేది రథం దగ్ధం లాంటి ఘటనలు సంచలనం సృష్టించినప్పుడు.. విచారణ పేరుతో హడావుడి చేస్తారు. చివరికి మతి స్థిమితం లేని వ్యక్తులు చేశారని చెప్పి కేసు క్లోజ్ చేసేస్తారు. రథం ఘటన వెనుక కుట్ర ఉందని సీబీఐకి ఇచ్చారుకానీ.. విచారణ మాత్రం ప్రారంభం కాలేదు.
విజయనగరంలో సీఎం పర్యటనకు మూడు రోజులు ముందుగా రామతీర్థం ఆలయంలో రాములవారి ఆలయంలో విగ్రహాన్ని తల వరకు పగులగొట్టి… పెద్ద అలజడి రేపడానికి ప్రయత్నించారు. హిందూత్వ సంఘాలు ఆందోళన చేశాయి. చివరికి సమీపంలోని ఓ కొలనులో విగ్రహం తల భాగాన్ని గుర్తించి తీసుకు వచ్చారు. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఖచ్చితంగా దీని వెనుక కుట్ర ఉందని.. స్పష్టంగా తెలుస్తోంది. కానీ.. పోలీసులు మాత్రం.. మతి స్థిమితం లేని వ్యక్తుల ఖాతాలో వేసేస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు మూడు రోజుల ముందుగా అంత పెద్ద కుట్ర జరిగితే.. పోలీసులు ఎందుకు లైట్ తీసుకుంటున్నారో తెలియని పరిస్థితి.
ఓ పద్దతి ప్రకారం.. హిందూత్వ వాదుల సెంటిమెంట్లను దెబ్బకొట్టే ప్రయత్నం జరుగుతోందని కొంత మంది ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఘటనలకు పాల్పడి… మత రాజకీయాలకు చేయాలని మరికొంత మంది ప్రయత్నిస్తున్నారని ఇతరులు ఆరోపిస్తున్నారు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ప్రణాళికా బద్దంగా కుట్రలు జరుగుతున్నాయన్న అనుమానాలు మాత్రం.. మొత్తంగా వ్యక్తమవుతున్నాయి. ఏపీలో కులంక్యాన్సర్ మాత్రమే ఇప్పటికి ప్రజల్లో ఉంది. మత పిచ్చి అంత ఎక్కువగా లేదు.కానీ.. మారిన పరిస్థితుల్లో దాన్ని కూడా.. ఇలాంటి ఘటనల ద్వారా ఎక్కించాలన్న ప్రయత్నాలు మాత్రం జరుగుతున్నాయన్న అనుమానాలు బలంగానే వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం అంటే.. రాజకీయం చేయడం కాదు. ప్రజల నమ్మకాల్ని.. శాంతిభద్రతల్ని కూడా కాపాడాలి. ఆ విషయంలో ప్రజల నమ్మకం కోల్పోతే తీవ్రంగా ఇబ్బందిపడాల్సి వస్తుంది. రాజకీయంగా లాభమా నష్టమా అని ఆలోచించాలి చర్యలు తీసుకోవాల్సిన ఘటనలు కావు అవి. వాటి వెనుక ఉన్న కుట్రను చేధించకపోతే.. ఇంకా ఇంకా జరుగుతూనే ఉంటారు. మత సామరస్యాన్ని దెబ్బతీస్తూనే ఉంటాయి. ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టాల్సి ఉంది.