విశాఖకు ఏమైనా తక్కువ అయింది అనిపిస్తే చాలు వెంటనే.. జీవీఎల్ నరసింహారావు తెర మీదకు వచ్చేస్తున్నారు. ఈ తక్కువ చేసింది ఆప్తమిత్రుడు జగన్ అయినా..సొంత ప్రభుత్వం అయిన కేంద్రం అయినా సరే ఆయన ఏ మాత్రం తడుముకోకుండా ఓ లేఖ రాసేస్తున్నారు. తక్షణం విశాఖలో ఆ తక్కువైన విషయాన్ని కవర్ చేయాలని అడుగుతున్నారు. తాను లేఖ రాసిన అంశాన్ని ఘనంగా మీడియాకు విడుదల చేయిస్తున్నారు. తాను విశాఖ కోసం పోరాడుతున్నానన్న ఫీలింగ్ కల్పించడానికి ప్రయత్నిస్తున్నారు.
తాజాగా ఆయన 5జీ సేవల విషయంలో కేంద్ర టెలికాం మంత్రికి లేఖ రాశారు. అసలు విశాఖ అంటే ఏమిటనుకున్నారు.. అని బిగిన్ చేసి.. విశాఖకు 5జీ ఇవ్వకపోవడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివరికి కనీసం వచ్చే సారి అయినా విశాఖలో 5జీ సేవలు ప్రారంభించాలన్నారు. ఆయన చెప్పకపోయినా రెండో విడత కూడా 5జీ సేవలు ప్రారంభించే సిటీల్లో విశాఖ లే్కపోతే .. అందరూ కేంద్రాన్ని తేడాగా చూస్తారు. ఇప్పుుడు తానే తెచ్చానని చెప్పుకోవడానికన్నట్లుగా జీవీఎల్ తీరు ఉంది.
ఇటీవలే రైల్వేజోన్ వివాదంలోనూ ఆయన స్పందించారు. రైల్వేజోన్ వస్తుందని ప్రకటించారు. కావాలంటే రైల్వో బోర్డు చైర్మన్తో ప్రకటన చేయిస్తానని కూడా చాలెంజ్ చేశారు. జీవీఎల్ నరసింహారావు ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీగా ఎన్నికైనప్పటికీ ఆయన ఏపీ విషయాల్లోనే ఎక్కువగా స్పందిస్తూ ఉంటారు. ఇటీవలి కాలంలో ఆయన విశాఖ నుంచే ఎక్కువగా రాజకీయ కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆయన విశాఖ నుంచి పోటీ చేయాలనుకుంటున్నారన్న ప్రచారం బీజేపీ వర్గాల్లో సాగుతోంది. ఈ కారణంగానే ఆయన విశాఖపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారని.. ఏమైనా సమస్యలు ఉంటే కేంద్రానికి లేఖలు రాస్తున్నారని అంటున్నారు.