ఒకప్పుడు యువతరాన్ని అలరించిన కథానాయిక రాశి. తెలుగు, తమిళంలో దాదాపు 75 చిత్రాల్లో నటించింది. ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రల్లో కనిపిస్తోంది. రాశీకి ఓ అలవాటు ఉంది. తను పుట్టిన రోజు పండగలు చేసుకోదు. దాని వెనుక ఓ విషాదంతమైన కారణం ఉంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే…
చెన్నైలో ఓ షూటింగ్లో బిజీగా ఉంది రాశీ. తెల్లారితే తన 18వ పుట్టిన రోజు. రాత్రి 12 గంటలకు రాశీతో కేట్ కట్ చేయిద్దామని చిత్రబృందం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఏర్పాట్లన్నీ అయిపోయాయి. 12వ గంట కూడా కొట్టేసింది. కానీ.. రాశీ ఓ ఫోన్ కాల్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ప్రతీ పుట్టిన రోజున తొలి శుభాకాంక్షలు తండ్రి నుంచి అందుకోవడం రాశీకి అలవాటు. తన ప్రతి పుట్టిన రోజు.. ఘనంగా చేయడం తండ్రికి ఇష్టం. దూరంగా ఉంటే.. కనీసం ఫోన్ చేసైనా సరే, శుభాకాంక్షలు, ఆశీస్సులు అందిస్తుంటారు. అయితే ఆ రోజు 12 అయినా.. తనతండ్రి నుంచి ఫోన్ రాలేదు. రాశీ మనసెందుకో కీడు శంకించింది. `నాన్న ఫోన్ చేయలేదు. ఆయనకేమైనా అయ్యిందా` అంటూ దిగులు పట్టుకుంది. మరోవైపు చిత్రబృందం కేక్ కట్ చేయించడానికి ఎదురుచూస్తోంది. వాళ్లని నొప్పించలేక… రాశీ కేక్ కట్ చేయడానికి రెడీ అయ్యింది. కేక్ మీద చాకు పెట్టిన వెంటనే.. రాశీకి ఓ ఫోన్ కాల్ వచ్చింది. అది తన తండ్రి నుంచే అని అనుకుంది రాశీ. కానీ.. ఫోన్ చేసింది మాత్రం డ్రైవర్. `మీ నాన్న గారు చనిపోయారు.. ` అంటూ చావు కబురు చెప్పాడు. అంతే… రాశీ నిర్ఘాంతపోయింది. సరిగ్గా తన పుట్టిన రోజు, అందులోనూ కేక్ కట్ చేసే సమయంలో తండ్రి చనిపోవడంతో రాశీ తేరుకోలేకపోయింది. ఆ బాధ లోంచి తేరుకోవడానికి రాశీకి చాలాకాలం పట్టింది. అప్పటి నుంచీ… రాశీ పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉంటోంది.