ఇళయరాజా.. పరిచయం అక్కర్లేని సంగీత సముద్రం. ఆయన ఎక్కువగా మాట్లాడరు. మాట్లాడినా… అది నా సంగీతం గురించో, పాటల గురించో అయ్యుంటుంది. అయితే తొలిసారి రాజకీయ పరమైన కామెంట్లు చేశారు ఇళయరాజా. అది కూడా మోడీని స్తుతిస్తూ. ఆయన్ని అభినవ అంబేద్కర్ అంటూ, అంబేద్కర్ బతికి ఉంటే మోడీ పాలన చూసి మెచ్చుకునేవారంటూ సగటు బీజేపీ అభిమానిలా మాట్లాడేశారు. బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ అనే సంస్థ `అంబేద్కర్ అండ్ మోడీ` అనే ఓ పుస్తకం ముద్రించింది. దానికి ఇళయరాజా ముందు మాట రాశారు. ఈ సందర్భంగా మోడీని కీర్తించడమే పనిగా పెట్టుకున్నారు. అంబేద్కర్ ఆలోచనలు, అభిప్రాయాలకు అనుగుణంగా పనిచేసే మోడీ లాంటి వాళ్లని ప్రోత్సహించాలని, ఆయన చేసే కార్యక్రమాలన్నీ అంబేద్కర్ ఆలోచనలకు దగ్గరగా ఉంటాయని.. ఈమేరకు ఇళయరాజా వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా, బేటీ బజావో కార్యక్రమాల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించిన ఇళయరాజా.. రోడ్లు, మెట్రో రైళ్లు, హైవేలూ.. ఇవన్నీ అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నాయంటే మోడీ చలవే అంటూ కామెంట్లు చేశారు.
మోడీ గురించి ఓ పుస్తకం ప్రచురించి, ముందు మాట రాసే అవకాశం ఇస్తే.. ఎవరైనా ఇలానే రాసుకుంటారు. కానీ ఇళయరాజా లాంటి వాడికి ఇదంతా అవసరమా? అనిపిస్తోంది. ఇప్పుడు ఇళయరాజాపై బీజేజీ ముద్ర వేయడానికి ఈ వ్యాఖ్యలు ప్రత్యక్షంగానే దోహదం చేసేలా ఉన్నాయి. మోడీ, బీజేజీ వ్యతిరేకులు.. ఇళయరాజా వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం మెడీని ప్రసన్నం చేసుకోవడానికే ఇళయరాజా ఇలా మాట్లాడారని, ఈ వయసులో, ఇంత విద్వత్తు సాధించి, ఇళయరాజా ఇలా ప్రభుత్వానికి, ప్రధానికి కొమ్ము కాయాల్సిన అవసరం ఏముందని, ఇప్పటి వరకూ దేశంలో జరిగిన అన్యాయాల గురించో, అక్రమాల గురించో, కుంభ కోణాల గురించో ఏనాడూ ఏ వ్యాఖ్య చేయని ఇళయరాజా.. ఇప్పుడెందుకు మోడీని నెత్తిన పెట్టుకున్నాడో చెప్పాలని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.