ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్రం తీసుకొచ్చిన చట్టం… ఉభయసభల్లోనూ ఆమోదం పొందింది. విపక్ష పార్టీలన్ని కొన్ని కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ.. చివరికి ఆమోదించాయి. ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలకు ఇంతకు మించి ఆప్షన్ ఉండదు. పైగా విపక్ష పార్టీలు గతంలో.. కొన్ని ఇలాంటి రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేశాయి. రాజస్థాన్లో గతంలోనే గెహ్లాట్ ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు ఇచ్చే ప్రయత్నం చేసింది. అలాగే కాంగ్రెస్ పార్టీ తన మేనిఫెస్టోలో పెట్టింది. కేరళలో కమ్యూనిస్టుల అచ్యుతనందన్ ప్రభుత్వం కూడా ఇలాగే ఇవ్వాలని చూసింది. అంటే విపక్ష పార్టీలన్నీ గతంలో ఇలాంటి ప్రయత్నం చేశాయి కాబట్టి… బిల్లును ఆమోదించక తప్పలేదు.
రూ. 8 లక్షలలోపు ఆదాయం ఉంటే బలహీనవర్గాలే..! వారిపై పన్ను ఎందుకు..?
ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి… రిజర్వేషన్లు ఇవ్వాలనడంలో ఎలాంటి భిన్నాభిప్రాయం లేదు. కానీ ఎలా అమలు చేస్తారన్నదానిపైనే అభ్యంతరాలు ఉన్నాయి. అదే సమయంలో… కొన్ని పొసగని అంశాలు బిల్లులో ఉన్నాయి. ఎనిమిది లక్షలలోపు వార్షికాదాయం ఉన్న వారందరికీ ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయని ప్రకటించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎవరు అనేదానిపై.. ఆయా రాష్ట్రాల్లో ఇప్పటి వరకూ వేర్వేరు నిబంధనలు ఉన్నాయి. ఇప్పుడు కేంద్రం.. దీన్ని రూ. 8లక్షలతో పాటు కొన్ని పారామీటర్స్ ప్రకటించింది. అయితే.. ఇప్పుడు ఆదాయపు పన్ను… రూ. రెండున్నర లక్షల సంపాదిస్తేనే విధిస్తున్నారు. ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. రూ. ఎనిమిది లక్షల లోపు ఆదాయం ఉన్న వారంతా ఆర్థికంగా బలహీనవర్గాలే. మరి అలాంటప్పుడు… ఆ బలహీనుల దగ్గర కూడా పన్నులు వసూలు చేస్తారా..?. లేక ఆదాయపు పన్ను పరిమితిని రూ. 8 లక్షలకు పెంచుతారా అని… తేల్చాల్సి ఉంది. ఎందుకంటే.. పేదలని ప్రభుత్వమే తేల్చింది కాబట్టి… వారి దగ్గర నుంచి పన్నులు వసూలు చేయకూడదు.
పది శాతం అగ్రవర్ణాలకు కాదు.. అందరికీనా…?
ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లు అమల్లోకి ఉన్నాయి. ఈ బీసీ రిజర్వేషన్లకు క్రీమిలేయర్ ఉంది. అంటే.. రూ. 8లక్షల ఆదాయం పై బడిన వారికి కూడా.. రిజర్వేషన్లు వర్తించవు. అంటే బీసీలు కూడా రిజర్వేషన్లు పొందాలంటే.. . 8 లక్షల ఆదాయ పరిమితి ఉంది. ఇప్పుడు కొత్త బిల్లులోనూ… అదే రూ. 8లక్షల పరిమితి పెట్టారు. ఇది అగ్రవర్ణాలకు కేటాయించిన పది శాతం కోటా అన్నట్లుగా చెప్పుకొస్తున్నారు కానీ… నిజానికి ఆర్థికంగా వెనుకబడిన అన్ని వర్గాలకు ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది. ఇప్పటికే.. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి.. ఈ పది శాతం కోటా వల్ల ఎక్కువగా ఉపయోగపడేది అగ్రవర్ణాలు కాబట్టి…ఇది ఉన్నత కులాల కోసం అని అంటున్నారు. కానీ కేంద్ర ప్రభుత్వ పారామీటర్స్ ప్రకారం… ఆర్థికంగా వెనుకబడిన వారు అందరూ అర్హులే. మరి ఇలాంటప్పుడు.. బీసీ లకు పరిమితి ఉంది.. అంతే పరిమితి ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకూ పెట్టడం వల్ల ప్రయోజనం ఏమిటి..? దీన్ని ఎలా అమలు చేస్తారు..?
రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగ పద్దతులు ఎందుకు పాటించలేదు..?
ఏ వర్గానికైనా రిజర్వేషన్లు ఇవ్వాలంటే.. కొన్ని పద్దతులు పాటించాలి. సామాజిక పరంగా.. విద్యా పరంగా వెనుకబడిన వారికి… వారికి రాజ్యవ్యవస్థలో సరైన భాగస్వామ్యం లేదనుకున్నప్పుడు రిజర్వేషన్లు ఇవ్వొచ్చని రాజ్యాంగం చెబుతోంది. ఇప్పుడు దీనికి కేంద్రం ఆర్థిక కారణాలు చేర్చింది. అయితే… ఇప్పుడు కేంద్రం కల్పిస్తామని చెబుతున్న రిజర్వేషన్లకు ప్రాతిపదిక ఏమిటి..? కాపు , ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వడానికి ఆయా ప్రభుత్వాలు కమిషన్ వేసి… నివేదికలు తెప్పించాయి. వాటి ప్రకారం… అసెంబ్లీ తీర్మానాలు చేశాయి. కానీ కేంద్రం.. ఈ పది శాతం కోటా విషయంలో ఏం చేసింది. తన నిర్ణయాన్ని బిల్లులను సమర్థించుకోవడానికి కేంద్రం వద్ద ఎలాంటి డేటా లేదు. ఈ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ఎలాంటి కసరత్తు చేయలేదు. ప్రభుత్వం ఓ పరిశోధన జరిపి… ఆ నివేదికను పార్లమెంట్ ముందు పెట్టి… ఈ కారణంతోనే.. రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పగలగాలి . కానీ కేంద్రం ఎలాంటి.. డేటాలేదు. రాజ్యాంగ బద్ధంగా వ్యవహించామని చెప్పడానికి కేంద్రం వద్ద… ఎలాంటి సమాచారం లేదు.
అమలులో వచ్చే సవాళ్లు పరిష్కరించడానికి చర్యలు ఏవి..?
ఒడిషా లాంటి రాష్ట్రంలో.. ఎస్సీ, ఎస్టీలకు 38 శాతం రిజర్వేషన్లు ఉన్నాయి. బీసీలకు పదకొండు శాతమే ఉన్నాయి. ఇప్పుడు ఆర్థికంగా బలహీనవర్గాలకు పది శాతంఇస్తున్నారు. అంటే.. జనాభా లో యాభై శాతానికిపైగా ఉన్నా బీసీలకు మాత్రం పరిమితంగా రిజర్వేషన్లు ఉన్నాయి. ఇలాంటి మౌలికమైన సమస్యలను… బీజేపీ మాత్రమే కాదు.. ఇతర పార్టీలు ఏవీ పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇంత వరకూ.. ఇచ్చిన తీర్పుల్లో.. కులం ప్రకారం… రిజర్వేషన్లు ఇవ్వాలని ఎప్పుడూ చెప్పలేదు. గతంలో…సుప్రీంకోర్టు తీర్పులు చూసినా… సామాజిక, ఆర్థిక పరిస్థితులను విశ్లేషించినా…. అనేక సవాళ్లు ఉన్నాయి అందుకే… వివిధ రాజకీయ పార్టీలు వీటన్నింటిని పరిష్కరించడానికి బిల్లును సెలక్ట్ కమిటికి పంపాలని కోరాయి. సరైన పద్దతిలో రిజర్వేషన్లు ఇస్తే కోర్టులు కొట్టి వేయడానికి కూడా అవకాశం ఉండదనుకున్నాయి. కానీ.. కేంద్రం అలా అనుకోలేదు.