ఈటల రాజేందర్‌కి తొలి అడుగులోనే బీజేపీలో నిరాదరణ ఎదురయినట్లుగా కనిపిస్తోంది. జేపీ నడ్డా సమక్షంలోనే బీజేపీలో చేరాలని పట్టుబట్టి కూర్చున్న ఆయనకు చివరికి పెట్రోలియం మంత్రి దేవేంద్ర ప్రధాన్‌తో కండువా కప్పుకోవాల్సి వచ్చింది. గతంలో ఢిల్లీకి వెళ్లి బీజేపీలో చేరేందుకు ప్రత్యేకంగా చర్చలు జరిపి వచ్చిన తర్వాత.. తన ఎంట్రీ .. ఓ రేంజ్లో ఉండాలని ఈటల షరతు పెట్టారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడే తనకు పార్టీ సభ్యత్వం ఇవ్వాలన్నారు. దానికి అంగీకరించిన పార్టీ నాయకత్వం.. నడ్డా అందుబాటులోఉన్నారని పధ్నాలుగో తేదీని ఖరారు చేశారు. నిజానికి ఈటల పదమూడో తేదీన చేరాలని అనుకున్నారు.
కానీ ఆ రోజున.. నడ్డా అందుబాటులో ఉండరని.. పధ్నాలుగో తేదీకి మార్చారు. తీరా ఢిల్లీకి వెళ్లిన తర్వాత నడ్డా… ఈటల జాయినింగ్ కార్యక్రమానికి రాలేదు. ఆయనకు బదులుగా ధర్మేంద్ర ప్రధాన్ వచ్చారు. దీంతో ఈటల వర్గీయుల్లో నిరాశ వ్యక్తమయింది. ఈటలను మొదటి అడుగులోనే అవమానించారన్న అభిప్రాయం వ్యక్తమయింది. అయితే బీజేపీలో చేరిక కార్యక్రమం పూర్తయిన తర్వాత అందరూ కలిసి.. జేపీ నడ్డా ఇంటికి వెళ్లి పరిచయ కార్యక్రమాలు ముగించుకున్నారు. ఫోటో సెషన్ నిర్వహించారు.
ఆ కార్యక్రమానికి ఒక్క ఈటల మాత్రమే కాదు.. తెలంగాణ నుంచి ముఖ్య నేతలందరూ వెళ్లారు. ముఖ్యంగా బండి సంజయ్ అనుచరులు పెద్ద ఎత్తున వెళ్లారు. తెలంగాణ బీజేపీలో గ్రూపులున్నాయన్న ప్రచారం నేపధ్యంలో.. జేపీ నడ్డాతో ఈటలకు కండువా కప్పించకుండా చేశారన్న అనుమానాలు ఈటల వర్గీయుల్లో వ్యక్తమవుతున్నాయి. అయితే.. ప ార్టీలో చేరిపోయారు.. ఇక వెనక్కి అడుగు వేయలేరు.. ఆ పార్టీలో సర్దుకుపోవాలి కాబట్టి.. ఈటల కూడా.. ఎక్కడా తన అసంతృప్తిని బయట పెట్టుకోలేదు.