ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీగా.. వైసీపీ.. తొలి రాజకీయ సమస్యను కాళేశ్వరం ఓపెనింగ్ రూపంలో ఎదుర్కొంటోంది. ఓ వైపు… ఎన్నికల్లో విజయం కోసం సహకరించిన ఆప్తమిత్రుడు.. మరో వైపు రాష్ట్ర ప్రయోజనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని డోలయమానంలో పడేస్తున్నాయి. ఆప్తమిత్రుడు వచ్చి.. తమ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసుకునేందుకు కట్టుకున్న ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు ముఖ్య అతిథిగా రమ్మని ఆహ్వానించబోతున్నారు. రానని చెప్పలేని మొహమాటం ఇప్పటికే.. వైసీపీ అధినేత, ఏపీ సీఎంకు ఉంది. అదే సమయంలో వెళ్తే.. అదే ప్రాజెక్ట్‌పై.. గతంలో.. తాను చేసిన పోరాటాన్ని తానే కించ పర్చుకున్నట్లు అవుతుంది. అంతేనా.. ముఖ్యమంత్రి హోదాలో.. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన సీఎం .. వ్యక్తిగత ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇచ్చారన్న అభిప్రాయం బలపడిపోతుంది. ఇదే ఇప్పుడు వైసీపీ వర్గాలను చికాకుపరుస్తోంది.
కాళేశ్వరం ఆహ్వానంపై వైసీపీ ఎందుకు మౌనంగా ఉంటోంది..?
కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అక్రమ ప్రాజెక్ట్ అనేది ఏపీ వాదన. పాత ప్రాజెక్టేనని.. తెలంగాణ వాదించి… ముందస్తుగా.. నదీబోర్డుల అనుమతి తీసుకోకుండానే కట్టేస్తున్నారు. దీనిపై ఏపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. చాలా ఫిర్యాదులు కేంద్రం వద్ద ఉన్నాయి. ఇలాంటి సమయంలో… ఏపీ సీఎం.. ఆ ప్రాజెక్ట్ ఓపెనింగ్‌కు వెళ్తే.. ఆ ఫిర్యాదులన్నింటినీ విలువ లేకుండా పోతుంది. తెలంగాణ సీఎంకు కావాల్సింది కూడా ఇదే. జగన్ వెళ్తే.. దాన్ని తన గొప్ప రాజకీయ చాణక్యంగా ప్రచారం చేసుకుంటారు. అందులో సందేహం లేదు. ఆ ప్రాజెక్టుకు అటు ఎగువ రాష్ట్రం.. ఇటు దిగువ రాష్ట్రం నుంచి ఇబ్బంది లేకుండా చూసుకున్నారనని కేసీఆర్ చెప్పుకుంటారు. కానీ జగన్ ఏం చెప్పుకుంటారు..?. అలాంటి ప్రాజెక్టులు కడితే.. ఇండియా, పాకిస్థాన్ లా పరిస్థితి మారుతుందని చేసిన హెచ్చరికల సంగతేంటి..? వాటిని ఎలా సమర్థించుకుంటారు..?
వైఎస్ ఆత్మను క్షోభ పెట్టవద్దని జగన్‌కు టీ కాంగ్రెస్ లేఖ..!
ప్రస్తుతానికి ప్రతిపక్షం తెలుగుదేశం సైలెంట్‌గానే ఉంది. ఎందుకంటే.. జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అడుగు వేస్తారో చూసి… మిగతా రాజకీయ దాడి చేయడానికి సిద్ధమవుతోంది. ప్రతిపక్షం ఎలాగూ విమర్శలు చేస్తుంది. కానీ.. తెలంగాణలో.. వైఎస్ ఆత్మీయులుగా పేరు పడిన వారందరూ.. జగన్ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క నేరుగా జగన్ కు ఓ లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి వస్తే.. వైఎస్ ఆత్మను క్షోభపెట్టినట్లేనని… సెంటిమెంట్ పండించారు. కాంగ్రెస్ నేతలు అందరూ.. దాదాపుగా విమర్శలు చేస్తున్నారు. ఇది కూడా.. వైసీపీ నేతలకు.. ఇబ్బందికరంగా మారింది.
కేసీఆర్‌కు కాదని చెప్పగలిగే పరిస్థితి జగన్‌కు ఉందా..?
కాళేశ్వరం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడానికి కేసీఆర్.. సోమవారం విజయవాడకు వస్తున్నట్లుగా.. తెలంగాణ సర్కార్ సమాచారం పంపింది. దానిని ఏపీ సర్కార్ తిరస్కరించలేరు. దాంతో భేటీ ఖాయమే. ఆహ్వానం కూడా ఖాయమే. వెళ్తారా లేదా.. అన్నదే అప్పుడే జగన్మోహన్ రెడ్డి ప్రకటించే అవకాశం ఉంది. జగన్ ఆహ్వానానికి అంగీకరిస్తే… తాను గతంలో చేసిన ఆరోపణలు… నీటి కేటాయింపుల్లో ఏపీకి అన్యాయం ఎలా రక్షిస్తారో ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. లేకపోతే.. ప్రజల్లో వేరే రకమైన అభిప్రాయం బలపడే అవకాశం ఉంది.