తెలంగాణ సీఎం కేసీఆర్ … టీచర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంలేదు. కారణం ఏమిటో తెలియదు కానీ.. ఆయన టీచర్లను దూరం పెడుతున్నారు. గ్రేటర్ ఎన్నికల విధుల్లో టీచర్లు ఖాళీగా ఉన్నప్పటికీ వినియోగించుకోలేదు. ఇతర జిల్లాల నుంచి వేరే శాఖల ఉద్యోగుల్ని తీసుకు వచ్చారు. సాధారణంగా ఎన్నికలంటే… విధుల్లో ఎక్కువగా కనిపించేది టీచర్లే. కానీ కేసీఆర్ మాత్రం వద్దనుకున్నారు. తాజాగా ఉద్యోగ సంఘాలకు వరాలు ప్రకటిస్తామంటూ ఏర్పాటు చేసిన భేటీకి కూడా ఉపాధ్యాయ, పెన్షనర్లు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులకు ఆహ్వానం పంపలేదు.
తెలంగాణలో సుమారు 120ఉద్యోగ సంఘాలున్నాయి. టీఎన్జీవో, టీజీవో లతో పాటు.. ఉపాధ్యాయ, పెన్షనర్లు, తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ లు ప్రధానమైనవి. పిలిస్తే అందర్నీ పిలవాలి. లేకపోతే మిగిలిన వారు ఫీలవుతారు. అయినా సరే ఉపాధ్యాయులు ఏమనుకున్నా సరే… వారినిదూరం పెట్టాలని కేసీఆర్ డిసైడయినట్లుగా తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. తమను ఉద్దేశపూర్వకంగానే ముఖ్యమంత్రి కేసీఆర్ దూరం పెడ్తున్నారని ఉపాధ్యాయ సంఘాలు కూడా అసంతృప్తిలో ఉన్నాయి. ఇతర సంఘాల నేతలు కూడా కేసీఆర్ ప్రాపకం కోసం ఉద్యోగుల్లో విభజన తెస్తున్నారని మండిపడుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జోనల్ వ్యవస్థను సవాల్ చేస్తూ..ఉపాధ్యాయ సంఘాలు కోర్టుకు వెళ్ళాయి. జోనల్ వ్యవస్థపై కోర్డులో స్టే వచ్చింది. ఈ విషయంపైనే కేసీఆర్ అసంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఓ సందర్భంలో తాను స్వయంగా విజ్ఞప్తి చేసినప్పటికీ… ఉపాధ్యాయులు పట్టించుకోలేదని.. అందుకే తాను వారిని పట్టించుకోకూడదన్నట్లుగా కేసీఆర్ ఉంటున్నారని అంటున్నారు. మొత్తానికి ఉపాధ్యాయ సంఘాలతో కేసీఆర్ మళ్లీ మామూలుగా వ్యవహరించాలంటే.. వారితో… అంతకంటే గొప్ప అవసరం పడాలన్న సెటైర్లు తెలంగాణ ఉద్యోగ సమాజంలో వినిపిస్తున్నాయి.