అక్రమ ఫామ్ హౌస్‌లు కట్టుకున్న బీఆర్ఎస్ నేతల జాబితాను ప్రకటిస్తూ మధ్యలో కేవీపీ పేరును ప్రస్తావించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. దీన్ని ఆయన తట్టుకోలేకపోయారు. కాంగ్రెస్‌లో తన చరిత్ర అంటూ చాలా పెద్ద లెటర్ రాశారు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి గుర్తించలేకపోవడం తన దురదృష్టమన్నారు. ఆయన కాంగ్రెస్‌లో పని చేసి.. పదవులు పొందారు. పార్టీని వైఎస్ సొంత ఆస్తిలా మార్చేందుకు సహకరించారు కానీ కాంగ్రెస్‌కు చాలా నష్టమే చేశారు. ఆయనేం చేశారన్నది పక్కన పెడితే.. ఆషామాషీగా రేవంత్ ఆయనను వ్యతిరేకించడం లేదని.. తెర వెనుక చేసిన కుట్రలు తెలుసు కాబట్టే ఆయన అలా మాట్లాడుతున్నారని చెబుతున్నారు.
బీఆర్ఎస్ అధికారంలో ఉన్నపదేళ్లలో కేవీపీ రామచంద్రరావు హవా నడిచిందని రేవంత్ నమ్ముతున్నారు. ముఖ్యంగా కాంట్రాక్టులు.. ఇతర విషయాల్లో కేసీఆర్ కు దిక్సూచీలాగా కేవీపీ ఉన్నారని ఆయనకు పక్కా సమాచారం ఉందని అంటున్నారు. గతంలో కూడా ఆయన కేవీపీపై ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. దానికి కారణం.. కేవీపీ,కేసీఆర్‌ది ఒకే సామాజికవర్గం. వారిని అది కలిపిందని ఆయన నమ్ముతున్నారు. కేవీపీ రేవంత్ కు రాసిన లేఖలో తాను కాంగ్రెస్ కు ఎంత సేవ చేశానో చెప్పుకొచ్చారు. తనపై ఇలాంటి అనుమానాలు ఉన్నాయి కాబట్టే కేవీపీ ఆ లేఖ ద్వారా రేవంత్ కు క్లారటీ ఇచ్చే ప్రయత్నం చేశారని అనుకోవచ్చు.
అంతకు ముందు పళ్లంరాజు సోదరుడి ఫామ్ హౌస్ కూల్చేసినప్పుడు కూడా హైకమాండ్ రేవంత్ ను అడ్డుకునే ప్రయత్నం చేసిందని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ కు అనుకూలంగా కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పళ్లం చేసిన వ్యాఖ్యలన్నీ రేవంత్ హైకమాండ్ ముందు పెట్టినట్లుగా చెబుతున్నారు. సీనియర్ల పేరుతో కాంగ్రెస్ ను అమ్ముకున్నప్రతి ఒక్కరి జాతకం రేవంత్ వద్ద ఉందని ఎవరితో ఎలా ఉండాలో అలా ఉంటున్నారని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.