కాంగ్రెస్ పార్టీ ఒక మహా సముద్రం. ఆ పార్టీకి ఒక తత్వం ఉంది. ఆల్రెడీ ఆ పార్టీలో ఉన్న వాళ్ళకు అది బాగా తెలుసు. కానీ కొత్తగా పార్టీలో చేరిన వాళ్ళకి అది బోధపడడానికి కాస్త సమయం పడుతుంది. బహుశా రేవంత్ రెడ్డికి ఇప్పుడిప్పుడే ఆ తత్వం బోధ పడుతున్నట్టుగా అర్థం అవుతోంది.
కాంగ్రెస్ లో చేరిన కొన్నేళ్ళ తర్వాత చిరంజీవి వి.హనుమంతరావు ఏర్పాటు చేసిన ఒక సభలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అనే ఈ నావ లో తన భవిష్యత్తు భద్రంగా ఉంటుందని వచ్చాను కానీ ఇక్కడ పరిస్థితి తేడా గా ఉంది అన్నట్టుగా మాట్లాడారు. అప్పుడు విశ్లేషకులు అంతా చేరేంతవరకు కాంగ్రెస్ రకరకాల హామీలు ఇస్తుందని కానీ ఒకసారి చేరాక కనీసం పట్టించుకోవడం కూడా మానేస్తుంది అని చిరంజీవికి ఇప్పుడు ఈ విషయం అర్థమైంది అని విశ్లేషించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇదే జరుగుతున్నట్లు ఉంది.
“నన్ను పార్టీలోకి రమ్మన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీ దూతలు ఎన్నో హామీలిచ్చారు. ఆ హామీలన్నీ వారికి తెలుసు. నా పనితీరు తెలిసి కూడా రాష్ట్ర టీం లీడర్ సరిగా వాడుకోవడం లేదు. ఆయనకు సలహాలిచ్చే వారు సరిగా లేరు. నాకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇచ్చినా తీసుకోను. ఆ పదవి వద్దని రాహుల్ గాంధీకి లేఖ రాస్తా. నా హోదాకు తగిన పదవిని ఆశిస్తున్నాను. “ అంటూ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ తనను వాడుకుంటే సొమ్ము చేసి పెడతానని, లేదంటే ఆ పార్టీకి మన్నే మిగులుతుందని వ్యాఖ్యానించారు. బీజేపీ చీఫ్ అమిత్షా ఎన్నో ఆఫర్లు ఇచ్చినా వదులుకున్నానని కూడా చెప్పారు. అలా వదులుకున్నందుకు పశ్చాత్తాపపడుతున్నాడో ఏమో మరి.
ఏదిఏమైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తుంటే, చిరంజీవి కానీ అంతకంటే ముందు కాంగ్రెస్లో చేరిన ఇతర నాయకులు కానీ చేసిన వ్యాఖ్యలకు పెద్ద భిన్నంగా ఏమీ లేవు. పార్టీలో చేరేంతవరకు హామీలు, ఆ తర్వాత మర్చిపోవడం, మళ్లీ అవసరపడితే బుజ్జగించడం, ఇవన్ని కాంగ్రెస్ పార్టీకి ఉగ్గుపాలతో పెట్టిన విద్య. బహుశా ఇప్పుడిప్పుడే రేవంత్ రెడ్డికి కూడా కాంగ్రెస్ తత్వం అవుతున్నట్టు ఉంది