తెలంగాణ భారతీయ జనతా పార్టీకి ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఐదుగురు ఐదు దారుల్లో వెళ్తూంటారు. ఒకరంటే.. ఒకరికి పడదు. నిత్య అసంతృప్తితో రగిలిపోతూంటారు. వీరి వ్యవహారం ఎలా ఉంటుందంటే.. అమిత్ షా తెలంగాణ పర్యటనకు వచ్చినప్పుడు… కిషన్ రెడ్డి..మొక్కుబడిగా పాల్గొన్నారు. అమిత్ షాతో పాటు.. స్టేజిపైకి ఎక్కడానికి కూడా నిరాకరించారు. అంతా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డామినేషన్ కారణంగా అప్పుడు అలా వ్యవహరించారు. ఆ తర్వాత అందరూ కలసి పని చేయాలని అమిత్ షా వార్నింగ్ ఇచ్చి వెళ్లారు. మొన్న వచ్చి కూడా అదే చెప్పారు. కానీ ఎవరి దారి వారిదే. ఇంకా చెప్పాలంటే.. మరింతగా ముదిరిపోయారు.
బీజేపీ హైదరాబాద్ పరిధిలోనే ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పటికీ… కిషన్ రెడ్డి , లక్ష్మణ్ ల మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. చింతల, ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ పైకి మాట్లాడుతున్నట్లు కనిసిస్తున్నా లోపల మాత్రం ఒకరిపై ఒకరికి అంతులేని ద్వేషం. ఈ సందట్లో మరో ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ఎవరూ పట్టించుకోలేదు. గతంలో ఆయన బీజేపీ నుంచి వెళ్లిపోతారని కూడా ప్రచారం జరిగింది. కానీ ఆయన తన కరుడుగట్టిన హిందూత్వ సిద్ధాంతంతో…బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాను ఆకట్టుకున్నారు. హైదరాబాద్ పర్యటనలో అమిత్ షాకు.. తెలంగాణ బీజేపీ నేతల వ్యవహారశైలిపై పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేశారట. దాంతో ప్రత్యేకంగా రాజా సింగ్ ను పార్టీ కార్యాలయానికి పిలిపించుకుని గంట సేపు మాట్లాడారు. దీంతో రాజాసింగ్ అమిత్ షాకు దగ్గరవుతున్నారని.. తమపై పితూరీలు చెబుతున్నారని దూరం పెట్టడం ప్రారంభించారు.
బీజేపీ జాతీయ ప్రధాన కారదర్శి మురళీధర్ రావు నాంపల్లి బస్తీబాట కార్యక్రమం నిర్వహించారు. నేతలంతా పెద్ద ఎత్తున కార్యకర్తలను పోగేశారు. కానీ నాంపల్లి నియోజకవర్గంలో కలిసిపోయినట్లు ఉండే గోషామహల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన రాజాసింగ్‌కు కనీసం మాట మాత్రంగా కూడా చెప్పలేదు. దీంతో రాజాసింగ్ కాస్త మనస్థాపం చెంది హైకమాండ్ కు ఫిర్యాదు చేశారు. నాంపల్లి రాజాసింగ్ నియోజకవర్గం కాదు కాబట్టి.. పిలువలేదని మురళీధర్ రావు కూడా సమర్థించుకుంటున్నారు. మొత్తానికి ఉన్న ఎమ్మెల్యే సీట్లు కూడా నిలబడతాయో లేదోనన్న సందేహంలో ఉన్న వారికి.. తెలంగాణ బీజేపీ నేతలు.. తమ తీరుతోనే క్లారిటీ ఇస్తున్నట్లవుతోంది.