దేశం అంతా.. రాఫెల్ స్కాం రచ్చ నడుస్తోంది. అన్ని పార్టీల నేతలు.. తమ తమ అభిప్రాయాలు స్పష్టంగా చెబుతున్నారు. కానీ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని పార్టీలు మాత్రం ఉద్దేశపూర్వక మౌనాన్ని పాటిస్తున్నాయి. తెలంగాణలో టీఆర్ఎస్ కాగా.. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం.. వైసీపీ. పవన్ కల్యాణ్ జనసేన కూడా.. రాఫెల్ పై తమ అభిప్రాయాలను ఏమీ వ్యక్తం చేయడం లేదు. బీజేపీతో ఉన్న లోపాయికారీ ఒప్పందాల కారణంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. రాఫెల్‌పై నోరు విప్పడం లేదనే విమర్శలు.. అంతకంతకూ పెరిగిపోతున్నాయి. తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పటికే విమర్శల దాడులు ప్రారంభించారు. ఓ వైపు జగన్.. దేశంలో చర్చనీయాంశమైన స్కామ్ గురించి పల్లెత్తు మాట మాట్లాడకపోవడమే కాదు.. జగన్ కు చెందిన మీడియాలో కూడా.. ఆయా స్కామ్ వార్తలకు కవరేజీ ఇన్వనివ్వడం లేదు. ఇక పవన్ కల్యాణ్.. నెల రోజుల విరామం తర్వాత బయటకు వచ్చారు.
ఇప్పటి వరకూ సోషల్ మీడియా ద్వారా కూడా స్పందించలేదు. ఇక ముందు ఏమైనాస్పందిస్తారేమోనన్న అంచనాలు అభిమానుల్లో వస్తున్నాయి. కానీ పవన్ కల్యాణ్ ట్రాక్ రికార్డును పరిశీలిస్తే.. కేంద్రాన్ని పల్లెత్తు మాట అనడం లేదు. ప్రత్యేకహోదా డిమాండ్ చేయాల్సిన చోట.. కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. జగన్, పవన్ తీరుపై.. ఏపీ రాజకీయ వర్గాల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. కేసులకు భయపడి జగన్, అంతర్గత అవగాహనతో పవన్ మాట్లాడటం లేదని టీడీపీ, కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. ఈ అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించుకుంది.
కాంగ్రెస్ పార్టీది కూడా ఇదే వ్యూహం. ఏపీ కాంగ్రెస్ ను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్న ఊమెన్ చాందీ…దీనిపై దృష్టి కేంద్రీకరించారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన జగన్ ఎందుకు నోరు మెదపడంలేదని, కేసులకు భయపడి పారిపోతున్నాడని చాందీ ఘాటుగానే విమర్శలు గుప్పిస్తున్నారు. మొత్తానికి ప్రత్యేకహోదా విషయంలో నోరు మెదకపోవడంతో.. జగన్, పవన్‌లకు.. ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటికి ఇప్పుడు రాఫెల్ తోడవుతోంది. రాఫెల్ పై ఏమైనా విమర్శలు చేస్తే.. బీజేపీ అగ్రనాయకత్వానికి ఎక్కడ లేని మంట పుడుతుంది. చేయకపోతే.. ప్రజలు.. కుమ్మక్కయ్యారని నమ్ముతారు. ఇద్దరు నేతలకు కాస్త ఇబ్బందికరమైన పరిణామమే.