జగన్ రెడ్డి తనకు కష్టం వచ్చిందని ఢిల్లీలో ధర్నా చేస్తే .. ఆయనకు ధైర్యం ఇవ్వడానికి ఇండియా కూటమిలోని పార్టీల నేతలందరూ వచ్చారు. టీడీపీపై విమర్శలు చేశారు. కానీ జగన్ మాత్రం ఇండియా కూటమికి ఏ విషయంలోనూ మద్దతు ప్రకటించడానికి ధైర్యం చేయడం లేదు. గతంలో పార్లమెంట్ లో ఏ విషయంలోనూ కాంగ్రెస్ కూటమిని సమర్థించలేదు సరి కదా ఇప్పుడు స్టాలిన్‌తో భేటీకి కూడా దూరంగా ఉన్నారు.
రాజకీయాల్లో ఆప్తమిత్ర పార్టీగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ సమావేశంలో పాల్గొనేందుకు నిర్ణయించింది. కేటీఆర్ కూడా వెళ్లారు. కానీ జగన్ మాత్రం అంత ధైర్యం చేయలేకపోయారు. స్టాలిన్ తో జగన్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. 2019లో జగన్ ప్రమాణ స్వీకారానికి వచ్చిన ఇద్దరు ముఖ్యమంత్రుల్లో ఒకరు ఆయన. రాజకీయంగా బీజేపీతో ఇక భయం వద్దని పోరాడాలని డీఎంకే నుంచి వచ్చిన సూచనల్ని కూడా ఆయన పెడచెవినా పెట్టారు.
దక్షిణాదికి అన్యాయం జరుగుతుందా లేదా అన్న అభిప్రాయాన్ని చెప్పడానికి కూడా జగన్ వణికిపోతున్నారు. బీజేపీని వ్యతిరేకిస్తే తన పరిస్థితి ఏమిటో ఆయనకు బాగా తెలుసు. అందుకే విదిలించేస్తున్నా సరే జగన్ ఆ పార్టీని వదిలి పెట్టడం లేదు. ఎన్డీఏ కూటమికి ఆయన ఢిల్లీలో మద్దతు తెలియచేయడానికి ఏ మాత్రం సిగ్గుపడటం లేదంటే.. ఇంకేం అనుకోవాలి ?
ఇలాంటి రాజకీయాలు చేస్తే జగన్ కు రాజకీయ భవిష్యత్ అనేది ఉండదని.. పోరాడాలని శ్రేయోభిలాషులు అదే పనిగా సలహాలిస్తున్నారు. కానీ జగన్ మాత్రం పోరాడితే జైలుకు పోతామని.. పార్టీ పోతుందని గట్టి క్లారిటీగా ఉన్నారు. అందుకే రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా లేరు.