వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచార సభలు గట్టిగా ముఫ్పై నియోజకవర్గాల్లో జరిగాయి. మొత్తంగా ఏపీ వ్యాప్తంగా 175 నియోజకవర్గాలు ఉంటే.. ఎన్నికల షెడ్యూల్ వచ్చిన తర్వాత కనీసం యాభై నియోజకవర్గాల్లో ప్రజలకు తాను చేసిందేమిటో.. మళ్లీ గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పలేకపోయారు. జగన్ ప్రచారం చేసిన నియోజకవర్గాలు ఎక్కువగా వైసీపీకి పట్టున్నవే.
సాధారణంగా పార్టీ బలహీనంగా ఉందనుకున్న నియోజకవర్గాలకు అధినేతలు ప్రచారంలో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన సభలు చూస్తే… చాలా మందికి ఆశ్చర్యం వేస్తుంది. కడప జిల్లాలో ఆయన మూడు నియోజకవర్గాలను కవర్ చేశారు. కడప టౌన్ లోనూ ఆయన ప్రచారం చేయాల్సి వచ్చింది. వరుసగా గెలుస్తూ వస్తున్న బాపట్ల, మాచర్ల, నర్సరావుపేట, కర్నూలు, పలమనేరు, వంటి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు.
నిజానికి వైసీపీకి చాలాకష్టంగా ఉన్న నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. కనీసం వంద నియోజకవర్గాల జోలికి వెళ్లలేదు. కూటమి ప్రభావం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్న కోస్తా ప్రాంతంలో.. ఉత్తరాంధ్ర, ఉభయగోదావరి జిల్లాల్లో ఆయన ప్రచారసభలు ఎక్కువగా పెట్టాల్సింది. కానీ తూ…తూ మంత్రంగా నిర్వహించేశారు. ఈ సారి కంచుకోటలు కూడా బద్దలయ్యే పరిస్థితి ఉందన్న ఆందోళనతోనే జగన్ ఇలా .. కనీసం అటూ ఇటుగా ఉన్న స్థానాలనైనా గెల్చుకుందామని అలాంటి ప్రచారం చేశారన్న అభిప్రాయం వినిపిస్తోంది.