కూటమి ప్రభుత్వం కొడుతున్న దెబ్బకు వైసీపీ సోషల్ మీడియా విలవిలలాడుతోంది. చావు దెబ్బలు తింటూ ఆదుకునే ఆపద్భాంధవుడి కోసం ఎదురుచూస్తుంది. నాడు వైసీపీ నేతల మీద ఈగ వాలకుండా చూసుకున్న సోషల్ మీడియా.. ఈ రోజు హాహాకారాలు పెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్న వేళ సోషల్ మీడియా కార్యకర్తల ఆవేదన ఇది.
బూటు కాలుకింద నలుగుతున్న చేతులు
నాడు జగన్ సిద్ధమా అంటే… తోడుగా సిద్ధమే అంటూ పైకి లేచిన చేతులు.. ఈరోజు బూటు కాలు కింద నలుగుతున్నాయి. జగన్ కు మద్దతుగా జై కొట్టిన గోంతుకలు.. ఈ రోజు పోలీస్ దెబ్బలకు హాహాకారాలు పెడుతున్నాయి. జగన్ ను సీఎం చేయాలని వేయి కళ్లతో చూసిన కళ్లు.. ఈ రోజు కన్నీరు పెడుతున్నాయి. “మీకెందుకు.. మేమున్నాం.. చూసుకుంటాం” అన్న సోషల్ మీడియా నేతలు.. నియోజకవర్గ ఇన్చార్జ్ లు ఈరోజు కనిపించడం లేదు. తమ కోసం స్టేషన్లకు రావడం లేదు. ఆ రోజు అండగా ఉన్న నేతలంతా ఇప్పుడు అండర్ గ్రౌండ్ లోకి పారిపోయారు.. ఫలితంగా సోషల్ మీడియా కార్యకర్తలు, నిజమైన అభిమానులు బలైపోయారు.
నాడు గుర్తించ లేదు.. నేడు గుర్తించడం లేదు
నాడు కార్యకర్తలు ఏడ్చారు.. నేడు కార్యకర్తలు ఏడుస్తున్నారు. నాడు జగన్ మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తలను గుర్తించలేదని.. వాలంటీర్లే ముఖ్యమని భావించారని బాధపడ్డారు. నేడు కేసులు పెట్టి ఇబ్బంది పెడుతున్నా జగన్ పట్టించుకోవడం లేదని అసహనం వ్యక్తం చేస్తున్నారు. 2014-19 మధ్య కాలంలో పార్టీకి సైనికులలా మారీ సార్వత్రిక ఎన్నికల యుద్ధాన్ని దగ్గరుండి గెలిపించిన కార్యకర్తలు.. జగన్ సీఎం అవ్వగానే కనిపించకుండా పోయారు. జగన్ ఫోకస్ అంతా సచివాలయ వ్యవస్థ మీదే ఉంది తప్ప.. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్త మీద లేకుండా పోయింది. సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, వార్డు మెంబర్లు, కాంట్రాక్టర్లు ఇలా అందరూ… నాడు-నేడు పనుల్లో భారీగా డబ్బులు పెట్టి.. బిల్లుల కోసం తిరిగితిరిగి చివరికి పార్టీ మిమ్మల్ని వదిలేసింది అనే స్థాయిని వారిని తీసుకువచ్చింది వైసీపీ. తీరా ఎన్నికల సమయానికి నియోజకవర్గ ఇన్చార్జ్ లను మార్చి.. భారీ తప్పటడుగు వేసింది. ఇక్కడ కూడా నష్టపోయింది కార్యకర్తే. ఎందుకంటే కొత్తగా వచ్చిన సమన్వయకర్తకు క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త ఎవరో తెలియదు. సమన్వయకర్త కార్యాలయం చుట్టూ తిరిగిన వారే తమ కార్యకర్తలను భావించే రాజకీయ నాయకులున్న జనరేషన్ ఇది.
ఎమ్మెల్యేలు మారినా,.. కార్యకర్త లోకల్..
నియోజకవర్గానికి సమన్వయకర్తలు వస్తుంటారు పోతుంటారు.. కానీ, కార్యకర్త లోకల్ అనే విషయాన్ని అధిష్టానం గుర్తించలేదు, గుర్తించడం లేదు. ఇది ఆవేదన వైసీపీ సోషల్ మీడియా వింగ్ ను మరింత కుంగదీస్తుంది. సోషల్ మీడియాను టార్గెట్ చేస్తే… ముందుగా ఆ విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహించిన సజ్జల భార్గవ్ ను టార్గెట్ చేయాలి, తర్వాత ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేను టార్గెట్ చేయాలి ఎందుకంటే వారు చెప్పబట్టే.. వీరంతా పోస్టులు పెట్టారనేది జగనేరిగిన సత్యం. కానీ ఈ రోజు చిత్రవాదలు అనుభవిస్తుంది మాత్రం సామాన్య కార్యకర్త మాత్రమే.
ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి.. ప్రతి సోదరుడికి.. ప్రతి స్నేహితుడికి
వారి ఆవేదనను అర్ధం చేసుకునే వారేరి.? వారికి భరోసా ఇచ్చే ఇన్చార్జ్లు ఏరి..? వారిని బయటకు తీసుకువచ్చే లాయర్లేరి..? ఎప్పుడు అరెస్ట్ చేస్తారో..? ఏ స్టేషన్ కు తీసుకువెళ్తారో..? ఎన్ని రోజులు తిప్పుతారో..? ఎప్పుడు కోర్టుకు తీసుకువెళ్తారో..? అనే భయంతో కుటుంబాలను, ఊర్లను వదిలి పారిపోవాల్సిన పరిస్థితి. ఆ కార్యకర్త దొరక్కపోతే వారి కుటుంబ సభ్యులను స్టేషన్ కు తీసుకువెళ్తున్న దుస్థితి. దీనంతటికి కారణం ఎవరు.? జగన్ మోహన్ రెడ్డా..? సజ్జల భార్గవ్ రెడ్డా..? లోకల్ మాజీ ఎమ్మెల్యేలా..? మాజీ ఎంపీలా..? ఎంఎల్సీలా..? ఆ నియోజకవర్గ సోషల్ మీడియా ఇన్చార్జ్ లా..? ఎవరు కారణం.? నేనన్నాను.. నేను విన్నాను… అన్న జగన్ మోహన్ రెడ్డికి.. వినబడుతోందా..? కనబడుతోందా..? ప్రతి అక్కకు.. ప్రతి చెల్లికి అని సంబోధించారుగా..! ఆ అక్కా చెల్లెళ్ల బాధ కనబడుతోందా..? ప్రతి సోదరుడికి, ప్రతి స్నేహితుడికి అని ప్రేమగా పిలిచారుగా జగన్ మోహన్ రెడ్డి!.. ఆ సోదరుడి, ఆ స్నేహితుడి ఆర్తనాదాలు వినబడుతున్నాయా.?