గత నాలుగేళ్ల నుంచి ఎప్పుడు మంత్రి వర్గ సమావేశం జరిగినా.. విశాఖకు రాజధాని మార్పు అంశంపై చర్చ ఉంటుందని మీడియాకు లీకులిస్తారు. చర్చిస్తారు కూడా. మంత్రులకు జగన్ ఫలానా తేదలోపు వెళ్తున్నామని చెబుతారు. దాన్ని మీడియాలో చిలువలు పలువలుగా చెబుతారు. కానీ ఇప్పుడు మాత్రం అసలు విశాఖ కాపురం గురించి మంత్రులతో జగన్ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దీంతో ఆయన ఈ విషయంలో ఓటమిని అంగీకిరంచేశారన్న వాదన వినిపిస్తోంది.
రాజధాని విషయంలో ఒక్క అడుగు వేయలేకపోయిన జగన్
జగన్ రెడ్డి చేస్తున్న రాజధాని రాజకీయంలో ప్రతీ సారి ఎదురుదెబ్బలు తింటున్నారు. ముహుర్తాలు ఖారారు చేయడం ఆ సమయానికి వెళ్లలేకపోవడం అనేది కామన్‌గా మారిపోయింది. మూడు రాజధానుల ప్రకటన చేసిన తర్వాత నాలుగైదు నెలల్లోనే విశాఖ వెళ్లడానికి జగన్ సిద్ధమయ్యారు. అప్పటికీ మిలీనియం టవర్స్ ను ఖాళీ చేశారు. చాలా వరకూ ఆఫీసులు చూసుకున్నారు. కానీ అనేక ప్రయత్నాలు చేసినా ఇప్పటిక ఒక్క అడుగు ముందుకు వేయలేకపోయారు.
దొడ్డిదోవన వెళ్లేందుకు చేసిన దొంగ ప్రయత్నాలూ ఫెయిల్
రాజధాని అనే పేరు లేకుండా.. విశాఖలో క్యాంప్ ఆఫీస్ ప్రారంభించడానికి సీఎం జగన్ చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. చివరికి డిసెంబర్ ప్రయత్నాలూ విఫలమయ్యాయి. మూడు రకాల కేసులు ప్రస్తుతం రాజధాని అంశంలో జగన్ ముందు ఉన్నాయి. అసలు రాజజధానిపై హైకోర్ట ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ లో ఉంది. అందుకే ఉత్తారంధ్ర అభివృద్ధి సమీక్ష పేరిట తన క్యాంప్ ఆఫీస్ మార్చాలనుకున్నారు. కానీ కోర్టులో కేసులు పడ్డాయి. ఇప్పుడు ఆ పిటిషన్లు తేలే వరకూ తరలించేది లేదని కోర్టుకు అఫిడవిట్ సమర్పించారు. అదే సమయంలో కనీసం ముఖ్యమంత్రి అయినా క్యాంప్ ఆఫీస్ మార్చుకోవడానికి ప్రయత్నించినా సాధ్యం కాదు. రుషికొండపై కట్టిన విలాసవంతమైన భవనం .. అక్రమ నిర్మాణం అని.. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారని కోర్టులో కేసు నడుస్తోంది.
ఇప్పుడు గెలుక్కుంటే మొదటికే మోసమని సైలెంట్ ?
ఏపీలో ఇప్పటికే ఎన్నికల హడావుడి ప్రారంభమయింది. ఇప్పుడు విశాఖ రాజధాని పేరుతో హడావుడి చేస్తే ఇటు కోస్తాలో అటు రాయలసీమలోనూ వ్యతిరేకత పెరుగుతుంది. అదే సమయంలో విశాఖ రాజధాని అంశంపై ప్రజల్లో సెంటిమెంట్ అసలు లేదన్న వాదన వినిపిస్తోంది. అందుకే పూర్తిగా విశాఖ రాజధానిపై మాటలు తగ్గించేశారని అంటున్నారు.