నెల్లూరు వైసీపీ చీలిక పేలికలు అవుతోంది. అంతర్గత రాజకీయాలతో సగం మంది ఎమ్మెల్యే్లు పక్క చూపులు చూస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. దీంతో అసంతృప్తి వ్యక్తం చేసిన వారిలో కొంత మందితో జగన్ మాట్లాడుతున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇటీవల పెన్షన్ల తొలగింపుతో పాటు ఇతర అంశాలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాలనపై ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మామూలుగా అయితే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. వెంటనే ప్రో వైసీపీ మీడియాలో .. జగన్ కన్నెర్ర.. కోటంరెడ్డికి షోకాజ్ వంటి వార్తలొచ్చేవి.
కానీ ఇటీవల అలాంటివి రాకపోగా.. కోటంరెడ్డిని బుజ్జగించడానికి జగన్ క్యాంప్ ఆఫీసుకు పిలిపించారు. ఆయన సమస్యలు సావధానంగా విన్నారు. కోటంరెడ్డి చాలా రోజులుగా పార్టీలో ఇబ్బందులు పడుతున్నారు. అయినా ఎప్పుడూ హైకమాండ్ పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం స్వయంగా పిలిచి జగన్ బుజ్జగించారు. నిజానికి పార్టీ చేపట్టిన గడప గడపకూ కార్యక్రమాన్ని కోటంరెడ్డి చేయడం లేదు. సొంత పేర్లతో ఇతర కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. అయినా ఆయనను జగన్ ఏమీ అనలేకపోయారు.
నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి కూడా ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. కానీ ఆయనను జగన్ పిలిపించలేదు. ఆయనకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ జెల్ల కొట్టి.. వెంకటగిరి టిక్కెట్ ను నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు రామ్ కుమార్ రెడ్డికి ఇవ్వాలని ఫిక్సయ్యారు. అందుకే ఆయన వెళ్లిపోయినా తప్పు లేదని.. జగన్ భావిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఆనంను వాడుకుని వదిలేశారన్న అభిప్రాయం ఆ పార్టీలో వినిపిస్తోంది