కర్ణాటక అప్పర్ భద్ర ప్రాజెక్టుకు కేంద్రం జాతీయ హోదా ఇచ్చింది. ప్రాజెక్టుకు బడ్జెట్లో ఏకంగా రూ. ఐదు వేల కోట్లకుపైగానే కేటాయించారు. పోలవరంకు రూపాయి కేటాయించకపోగా… నీటికేటాయింపులు లేని అప్పర్ భద్రకు నిధులు కేటాయించడం ఏపీకి ఇబ్బందికరంగా మారింది. అయితే నిధుల విషయంలోనే కాదు.. అసలు ఆ ప్రాజెక్టు నిర్మిస్తే రాయలసీమకు తీవ్ర నష్టం జరుగుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ ఘనత వహించిన ప్రభుత్వం మాత్రం నోరు మెదపడం లేదు.
కర్నూలు జిల్లాతో పాటు సీమ ప్రాంతానికి సాగు, తాగునీరు అందించేది తుంగభద్ర, కర్నాటకలో భారీ వర్షాలు కురిస్తేనే నీటి ప్రవహం ఉంటుంది. ఇప్పుడు అసలు నీటిని దిగువకు రాకుండా తుంగభద్ర జలాశయం ఎగువన కర్నాటక అప్పర్ భద్ర ప్రాజెక్టు నిర్మాణంకు సిద్ధమయింది. దీంతో ఏపీలోని రాయలసీమకు నీళ్లు రావాలంటే కష్టమవుతుంది.
2014లోనేప్రాజెక్టు నిర్మాణంను కర్ణాటక ప్రారంభించింది. అప్పటి ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరం చెబుతూ వస్తూండటంతో ఆగిపోయింది. కానీ ఇప్పుడు కేంద్రం నేరుగా నిధులుకేటాయించింది.
అప్పర్ భద్ర పూర్తయితే తుంగభద్ర డ్యామ్ కింద కర్నాటక, ఏపిలోని ఆయుకట్టుతో పాటు కర్నూలు జిల్లాలోని కేసి కాలువ, ఆర్డిఎస్ కింద ఆయుకట్టు బీడుగా మారిపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీటి ప్రవహాం రావడంలో ఆలస్యం చోటుచేసుకుంటుంది. ఇది ఆ ప్రాజెక్టు ఆయుకట్టు రైతులకు ఇబ్బందికరమే. నిజానికి కృష్ణా జల వివాదాల ట్రీబునల్ అప్పర్ భద్రకు ఎలాంటి నీటి కేటాయింపులు చేయలేదు. అయినా కేంద్రం నిధులు ఇస్తోంది . దీన్ని ఏపీ ప్రభుత్వం ఖండించడం లేదు.
రాష్ట్రంలో ఏం జరుగుతోందో, పక్క రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో ముఖ్యమంత్రి జగన్ రెడ్డికి కనీస స్పృహ కూడా లేకుండా పోతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే సీమ ప్రాజెక్టులు మొత్తం మూలన పడేసి నష్టం చేశారని, ఇప్పుడు ఎగువ భద్ర ప్రాజెక్టుపై ఏం మాట్లాడకుండా మౌనం వహిస్తూండటంతో రాయలసీమ తీవ్రంగా నష్టపోనుంది.