జనసేన పార్టీ మూడు రోజుల పాటు జగనన్న ఇళ్లు – పేదలందరికీ కన్నీళ్లు పేరుతో డిజిటల్ ఉద్యమం నిర్వహించింది. రోడ్ల స్థాయిలో ఈ సమస్యను హైలెట్ చేయాలనుకుంది. కానీ రోడ్ల సమస్యపై డిజిటల్ యుద్ధం చేయాలనుకున్నప్పుడు పార్టీలోని అన్ని స్థాయిల క్యాడర్ కదిలి వచ్చింది. సోషల్ మీడియాలో ఫోటోలతో హోరెత్తించింది. దీంతో పాటుగా పవన్ కల్యాణ్ కూడా స్వయంగా రెండు చోట్ల శ్రమదానం చేసి రోడ్లను బాగు చేయాలనుకున్నారు. చేశారు. ఆ సమయంలో చాలా మైలేజ్ వచ్చింది. అయితే ఈ సారి ఇళ్ల విషయంలో మాత్రం జనసేన అంత యాక్టివ్గా పని చేయలేకపోయింది.
నిజానికి ఇళ్లు చాలా పెద్ద సమస్య. ప్రభుత్వ తీరు వల్ల ప్రజలు అప్పుల పాలవుతున్నారు. టిడ్కో ఇళ్లు ఇవ్వడం లేదు. సెంట్ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడానికి అదనంగా నాలుగైదు లక్షలు ఖర్చవుతున్నాయి. అయినా అది నివాస యోగ్యంగా ఉంటుందని ఎవరూ అనుకోవడం లేదు. ఇలాంటి సమయంలో అందర్నీ మొబిలైజ్ చేసి భారీ ఉద్యమం చేపట్టాల్సిన జనసేన.. సోషల్ మీడియా పోస్టుల్లోనే తేలిపోయింది. స్వయంగా వైసీపీ.. జనసేనకు షాక్ ఇచ్చేందుకు లబ్దిదారుల పేరుతో కొన్ని చోట్ల జనసేన నేతలను అడ్డుకుని వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో జనసేనకు షాక్ తగిలినట్లయింది.
ప్రభుత్వం కట్టిస్తామన్న ఇళ్లు ఎక్కడివక్కడే ఉండిపోయాయి. లబ్దిదారులు అప్పులు చేసైనా ఇళ్లు కట్టుకోవాలని లేకపోతే.. స్థలం రద్దు చేస్తామన్న బెదిరింపులకు దిగారు. ఇవన్నీ హైలెట్ చేయలేకపోయారు. ఇంత క్లిష్టమైన సమయంలో.. కక్ష సాధింపుల్లో ఎవరూ ఊహించని విధంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పేదలు.. ముఖ్యంగా ఇళ్ల లబ్దిదారులు వస్తారని ఎవరూ అనుకోరు. వారి ప్రమేయం లేకుండా ప్రభుత్వ అవినీతిని బయట పెట్టడానికి ప్రయత్నించాల్సింది. కానీ ఆ విషయంలో జనసేన వ్యూహాత్మక తప్పిదం చేయడంతో.. ఇళ్ల సమస్యను.. రోడ్ల స్థాయిలో హైలెట్ చేయలేకపోయారన్న వాదన వినిపిస్తోంది.