రాజకీయాల్లో అధికారమే పరమావధి అన్నట్లుగా ఉంటోంది ఇప్పటి రాజకీయ నాయకుల వ్యవహార శైలి. ఎన్నికల్లో తమ పార్టీ ఓడిపోగానే, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోకో లేదంటే కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ లోకో ఫిరాయించడం అత్యంత సర్వసాధారణం అయిపోయింది. అందులోనూ, అంగబలం అర్థబలం పెద్దగా లేని జనసేన లాంటి పార్టీ నుండి ఇటువంటి వలసలు ఊహించగలిగినవే. అయితే జనసేన పార్టీ నుండి వలస వెళుతున్న వాళ్ళలో దాదాపుగా అందరూ నాదెండ్ల మనోహర్ మీద తీవ్ర విమర్శలు చేస్తూ వెళ్తున్నారు. పార్టీ నుండి వలస వెళ్ళిపోతూ నాదెండ్ల నే ఎందుకు టార్గెట్ చేస్తున్నారన్నది చర్చనీయాంశంగా మారింది.
జన సేన పార్టీ నుంచి అందరి కంటే ముందుగా బయటకు వెళ్లిపోయిన వ్యక్తి విజయ్ బాబు. ఒకప్పుడు సమాచార కమిషనర్ గా పనిచేసి, ప్రజారాజ్యం పార్టీ సమయంలో కూడా చిరంజీవికి సన్నిహితంగా మెలిగిన విజయ్ బాబు జనసేన పార్టీని వీడి బిజెపిలో చేరి పోయారు. పార్టీని వీడిన తర్వాత ఆయన నాదెండ్ల మనోహర్ మీద విమర్శలు చేశారు. పార్టీలో అన్నీ తానే అయి నడిపిస్తున్నాడని, ఎన్నికలకు ముందు తాను సూచించిన వ్యక్తులకు టికెట్లు రాకుండా అడ్డు పడ్డాడు అని, ఇలా రకరకాల విమర్శలు చేశాడు. అయితే ఆయన వ్యాఖ్యల లో తాను సమాచార కమిషనర్ గా పనిచేశాను అన్న సోత్కర్ష, దాంతోపాటు నాదెండ్ల మనోహర్ స్థాయిని తగ్గించే ప్రయత్నం కనిపించేది. మనోహర్ కూడా రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ స్థాయిలో పని చేసిన వ్యక్తి అని గుర్తించడానికి విజయబాబు పెద్దగా ఇష్టపడనట్లు కనిపించింది.
జనసేన అధికార ప్రతినిధి గా ఉండి ఎన్నికలయిపోగానే పార్టీని వీడిన అద్దెపల్లి శ్రీధర్ కూడా తర్వాత తీవ్ర విమర్శలు చేశారు. ఆమధ్య పవన్ కళ్యాణ్ , నాదెండ్ల మనోహర్ అప్పటి గవర్నర్ నరసింహన్ ని కలిస్తే, అద్దేపల్లి దాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. కేవలం నాదెండ్ల మనోహర్ ను మాత్రమే గవర్నర్ దగ్గరకు తీసుకెళ్లడం సరి కాదని, పార్టీలో ఉన్న మిగతా వాళ్ళని కూడా పవన్ కళ్యాణ్ గవర్నర్ వద్దకు తీసుకెళ్లాల్సిందని ఆయన విమర్శించారు. పలు టీవీ డిబేట్ ల లో సైతం పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ కి ఇస్తున్న ప్రాధాన్యత కారణంగా జనసేన పార్టీలో ఉన్న పలువురు అసంతృప్తికి గురవు తున్నారు అని ఆయన వ్యాఖ్యానించారు.
ఇక తాజాగా ఈ లిస్టులో చేరిన మరొక జనసేన నాయకుడు చింతల పార్థసారథి. పవన్ కళ్యాణ్ ఈయనను ఎంతో బాగా చూసుకున్నారు. ఎన్నికలకు పోటీ చేసే అభ్యర్థులను వడబోసే సెలక్షన్ కమిటీకి అధ్యక్షుడిగా ఆయన ని నియమించారు. ఈయనకు ఎంపిక టికెట్ ఇస్తే పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఆయన కూడా కేవలం నాదెండ్ల మీదే విమర్శలు కురిపిస్తున్నారు.
అయితే, ఈ వ్యాఖ్యలను గమనిస్తున్న జనాలలో ఎందుకని జనసేన నుండి వెళ్ళిపోతున్న నాయకులంతా కేవలం నాదెండ్ల మనోహర్ నే గురి పెడుతున్నారని సందేహాలు వస్తున్నాయి. పైగా ఒక్కోసారి వారు చేసే వ్యాఖ్యలు, విమర్శల స్థాయి దాటి విషం కక్కుతున్నట్లు గా కనిపిస్తున్నాయి. నిజానికి జనసేనలో చేరిన వారి లో దాదాపుగా చాలామంది గతంలో ఎప్పుడూ ఎన్నికల బరిలో నిలిచిన వారు కాదు. వీరికి రాజకీయ అనుభవం తక్కువ అయినప్పటికీ, వారి ఆలోచనా ధోరణి నచ్చి, పార్టీకి వారు విధేయంగా ఉంటారని, సీజనల్ రాజకీయ నాయకుల వలె ప్రవర్తించారనే భావంతో పవన్ కళ్యాణ్ వీరిని చేర్చు కున్నట్లుగా తెలుస్తోంది. అయితే పలు రకాల రాజకీయ కార్యకలాపాలు నిర్వహించడానికి, రాజకీయ అనుభవం ఉన్న నాదెండ్ల మనోహర్ మీద పవన్ కళ్యాణ్ ఆధారపడాల్సి వచ్చింది. మొదటి నుండి రాజకీయాల్లో ఉన్న కుటుంబం నుండి వచ్చిన వాడు కావడంతో నాదెండ్ల మనోహర్ ఇటువంటి కార్యకలాపాలను చక్కబెట్టడం లో అందె వేసిన చేయి కావడం పవన్ కళ్యాణ్ గుర్తించినట్లుగా అనిపిస్తోంది. అయితే పార్టీ బలోపేతం కోసం పవన్ కళ్యాణ్ నాదెండ్ల మనోహర్ ను మరింత దగ్గర చేసుకోవడం కూడా జీర్ణించుకోలేని స్థాయిలో కొంతమంది జనసేన నాయకులు ఉండటం, వారికి పార్టీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం అన్నట్టుగా ప్రవర్తించడం జనసేన అభిమానులతోపాటు విశ్లేషకులను కూడా ఆశ్చర్యపరిచింది. సీజనల్ రాజకీయ నాయకుల వలే ప్రవర్తించరు అనుకున్న నాయకులే ఇప్పుడు ఫక్తు రాజకీయ నాయకుల కంటే ముదురు వ్యాఖ్యలు చేయడం జనసేన అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది. కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం మాత్రమే వీరు పార్టీని వీడుతున్నారు అని జనసేన అభిమానులతో పాటు సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతోంది. అయితే పార్టీని వీడేటప్పుడు తమ నిర్ణయాన్ని బలపరచు కోవడానికి ఏవో ఒక రకమైన వ్యాఖ్యలు చేయాలి. అలాగని పవన్ కళ్యాణ్ మీద నేరుగా బురద చల్లలేరు. ఎందుకంటే – తన పరిధిలో, పవన్ కళ్యాణ్ మంచి వ్యక్తులకే టికెట్లు ఇచ్చిన కారణంగా, డబ్బు ప్రభావం వీలైనంత వరకు లేకుండగా ఎన్నికలలో పాల్గొన్న కారణంగా, ఏమాత్రం మీడియా మద్దతు లేకపోయినా ఒంటరిగా పోరాడుతున్న కారణంగా కాస్త సింపతి ఇప్పటికి పవన్ కళ్యాణ్ మీద ఉండడంవల్ల, పవన్ కళ్యాణ్ మీద నేరుగా బురద చల్లే వ్యాఖ్యలు చేస్తే అవి బ్యాక్ ఫైర్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి, పవన్ కళ్యాణ్ ని కాకుండా ఆ పార్టీలో బలమైన నేతగా కనిపిస్తున్న టువంటి నాదెండ్ల మనోహర్ మీద గురి పెడుతున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇక జనసేన నుండి వెళ్లిపోయిన విజయబాబు ఇప్పుడు బిజెపి తరఫున అధికార ప్రతినిధిగా ఉన్నారు. చింతల పార్థసారథి కూడా బిజెపిలోకి చేరిపోయారు. అద్దేపల్లి శ్రీధర్ బి జె పీ లో చేరాలి అనుకున్నప్పటికీ ఎందుకనో బిజెపి ఆయన కి తలుపులు మూసివేసీంది. దీంతో ఆయన ఏ పార్టీలో చేరకుండా అలా ఉండి పోయారు.
ఏది ఏమి అయినప్పటికీ, జనసేన కంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్న బిజెపిలోకి, కేవలం కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ అనే కారణంతో, వీరు వెళ్లడమే వీరి నిబద్ధత ఏమాత్రమో అన్నది ప్రజలకు అర్థమయ్యేలా చేస్తోంది అన్న భావన సర్వత్రా వినిపిస్తోంది.