రాజకీయంగా ఎంత క్రియాశీలకంగా ఉంటే ప్రజల్లో అంతగా నానుతారు. లేకపోతే జనం మర్చిపోతారు. జనసేన పరిస్థితి అదే. ఇప్పుడు ఏపీలో హై వోల్టేజ్ రాజకీయ సన్నివేశాలు నడుస్తున్నాయి. ఓ వైపు ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని .. టీడీపీ నేతలు బలంగా ప్రజల్లోకి వెళ్తున్నారు. మరో వైపు బీజేపీ నేతలు టీడీపీని.. టీడీపీ అధినేతను సందర్భం సృష్టించుకుని మరీ పొగుడుతున్నారు. దానికి తోడు కొత్తగా న్యూడ్ వీడియో వ్యవహారం ఉంది. అయితే ఎక్కడా జనసేన ఈ వ్యవహారాల్లో కనిపించడం లేదు.
పవన్ కల్యాణ్‌కు వైరల్ ఫీవర్ వచ్చిందని అందుకే ఆయన బయటకు రావడం లేదని చెబుతున్నారు. దాదాపుగా మూడు వారాలుగా ఆయన అనారోగ్యంతో ఉన్నారు. ఇన్ని రోజులు బాలేదంటే అది కాస్త సీరియస్ అంశమే అనుకోవచ్చు. అయితే ఆయన యాక్టివ్‌గా లేకపోతే పార్టీ కూడా పడుకుంటుందా.. ఎలాంటికార్యక్రమాలు ఉండవా అనేది క్యాడర్‌కు వస్తున్న సందేహం. నాదెండ్ల మనోహర్ చాలా రోజుల తర్వాత ప్రెస్ మీట్ పెట్టి.. . అప్పు తెచ్చిన ఆరు వేల కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించారు కానీ ఎవరూ పట్టించుకోలేదు.
జనసేన ఎప్పటికప్పుడు ప్రజల్లో. .. ప్రచారంలో ఉండేలా తన వ్యూహాల్ని మార్చుకోవాలి. పవన్ కల్యాణ్ జనంలోకి వచ్చే రెండు రోజులు మాత్రం హడావుడి.. తర్వాతేం ఉండదంటే… ప్రజలు కూడా లెక్కలోకి తీసుకోరు. నిరంతరం ప్రజల్లో ఉండి పోరాడితేనే ప్రయోజనం. ఈ విషయాలు తెలుసుకోవడానికి రాజకీయాల్లో పండిపోవాల్సిన పని లేదు. అందరికీ తెలుసు. కానీ జనసేన మాత్రం ఎందుకు అమలు చేయలేకపోతోందో మరి !