తెలుగు సినీ రంగంలో మహిళా జూనియర్ ఆర్టిస్టులపై జరుగుతున్న లైంగిక, ఆర్థిక దోపిడీ కి వ్యతిరేకంగా గళమెత్తారు జూనియర్ ఆర్టిస్టులు. న్యాయం జరిగే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తాం అని శపథం చేశారు.తమకిచ్చే రెమ్యూనరేషన్లో కో-ఆర్డినేటర్లు, మేనేజర్లు, మధ్యవర్తులుగా వ్యవహరించేవారు కోతలు విధించి చేతికి రూ.1000-1500 ఇస్తున్నారని, అవుట్డోర్ షూటింగ్లో డ్రెస్ మార్చుకునేందుకు, కాలకృత్యాలకు కూడా సౌకర్యాలు లేవని, తెలుగు సినిమా రంగంలో ఉన్న కీచకులకి బుద్ది చెప్పాలని సినిమా రంగంలోనూ షీటీమ్లను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇది చాలా మంచి పరిణామం. దశాబ్దాల నుంచి ఈ సమస్య ఉన్నా, శ్రీరెడ్డి ఘటనతోనే తెలుగు సినీ రంగంలో జరుగుతున్న ఈ అరాచకాలన్నీ ఇప్పుడు బయటికి వచ్చాయి.
అయితే ఈ పోరాటం లో భాగంగా జూనియర్ ఆర్టిస్టులు పవన్ కళ్యాణ్ పై ధ్వజమెత్తడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొందరు దుయ్యబడితే, ఇంకొందరు- మహిళలంతా పవన్ పార్టీ కి ఓటు వేయకూడదని పిలుపునిచ్చారు. అయితే వీరు క్యాస్టింగ్ కౌచ్ అంటూ తమని మోసం చేసిన పెద్దల కంటే ఎక్కువగా పవన్ పై ఆరోపణలు సంధించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
సినీ పరిశ్రమ లో అగ్ర తారగా ఉండి ప్రస్తుతం ఎమ్మెల్యే గా ఉన్న బాలకృష్ణ ని కానీ, ఎంపీ గా ఉన్న సినీ నటుడు మురళీమోహన్ ని కానీ ఎపి అదికార పార్టీ అయిన టిడిపి ని కానీ, ఇక్కడ టీఆరెస్ ని కానీ అభ్యర్థించకుండా, ఏ పదవి లో లేని పవన్ ని టార్గెట్ చేయడమెంతవరకు సమంజసం అని పవన్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. నిజంగా పోలీస్ కేస్ పెట్టి న్యాయం జరగకపోతే మద్దతివ్వాలని రాజకీయ పార్టీలని కోరినా తప్పు లేదు కానీ అవేమీ చేయకుండా పవన్ ని టార్గెట్ చేయడం ఎంతవరకు సమంజసమని వారు అడుగుతున్నారు.