మాజీ రాష్ట్రపతి, శాస్త్రవేత్త, మహామేథావి, మహాదార్శనికడైన అబ్దుల్ కలాంగారికి మతపెద్దలంటే చాలా గౌరవం. మతాచార్యులు లేదా బాబాలు ఎవరు కనిపించినా వారి వద్ద నుండి ఉపదేశం పొందాలని అనుకునేవారు. మతపెద్దలంటే కలాంకు ఎందుకంత గౌరవం? అన్న ప్రశ్నకు సమాధానం సూటిగా దొరక్కపోయినా ఆయన ప్రసంగాల్లో అక్కడక్కడా అంతర్లీనంగా సమాధానం దొరుకుతుంది.
ఇప్పుడు ఈ విషయం ఎందుకు ప్రస్తావించాల్సి వస్తున్నదంటే, అబ్దుల్ కలాంగారి మరణవార్త వినగానే దేశం యావత్తూ చలించిపోయిన సమయంలోనే, కొంతమంది ఆయనలో నెగెటీవ్ కోణాలేమైనా ఉన్నాయేమోనని వెతకటం ప్రారంభించారు. అబ్దుల్ కలాం ఒక స్వామీజీ పాదాల చెంత కూర్చుని ఉన్న ఫోటోని పోస్ట్ చేస్తూ విమర్శల వర్షం కురిపిస్తున్నారు. ఒక శాస్త్రవేత్త, ఒక మేథావి, రాష్ట్రపతి పదవిలో కొనసాగిన వ్యక్తి ఇలా స్వామీజీల పాదాల చెంత కూర్చోవడం తగునా? ఇది దేన్ని సూచిస్తుందన్నది వారి విమర్శ. ఈ తరహా అనుమానాలను నివృత్తి చేసే ప్రయత్నమే ఇది…
ఒకాయన ఇలా రాశారు….
`అబ్దుల్ కలాం ప్రతి బాబా , స్వాములను వారి ‘ స్పిరిచువాలిటీ ‘ ని కళ్ళ కద్దుకోవడం లో ఏ మాత్రం వెనుకాడే వాడు కాడు’
ఆయన రాసినదాంట్లో తప్పేమీలేదు. కలాం పుట్టపర్తి సత్యసాయిబాబానో లేదా మరో బాబానో లేదా స్వామీజీనో దర్శించుకున్న మాట నిజమే. వారితో సన్నిహితంగా మెలిగినమాట కూడా వాస్తవమే. పాదాల చెంత కూర్చుని వారి ఆశీస్సులు అందుకున్నమాట కూడా నిజమే. అయినంతమాత్రాన మతానికి లొంగిపోయిన లేదా వొంగిపోయిన వ్యక్తిగా కలాంని చిత్రీకరించడం సరైన పద్ధతికాదు.
మహావ్యక్తి అని అంతా కొనియాడుతున్న తరుణంలో పనిగట్టుకని ఇలా నెగెటీవ్ గా రాయడం కేవలం సదరు వ్యాసకర్తలు లేదా ప్రచారకర్తలు తమ పబ్బంగడుపుకోవడానికే తప్ప వేరే కాదేమో అనిపిస్తోంది. ఒక మాజీ రాష్ట్రపతి మరణంతో మీడియా , సోషల్ మీడియా , ప్రభుత్వాలు ఇంకా అనేక సంస్థలు శోకసముద్రంలో మునిగిపోవడం నెగెటీవ్ భావజాలం ఉన్న రచయితలకు గిట్టడంలేదు. గాంధీ, నెహ్రూల మోస్తరుగా కలాంని కొనియాడటం వారికి నచ్చదు. మైనస్ పాయింట్లు వెతికి పట్టుకుని వాటిని జీడిపాకంలా సాగదీసి సంతోషపడుతుంటారు. హేతువాదమంటూ వ్యక్తి స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేస్తుంటారు.
కలాం చేసిన తప్పేమిటి ?
అబ్దుల్ కలాం ఉన్నట్టుండి, రాత్రికిరాత్రి మేథావిలా మారిపోలేదు. చిన్నతనంలో అమ్మ నుంచి నేర్చుకున్న పాఠాలు, ఆ తర్వాత గురువులు, ఆపైన సభ్య సమాజం నుంచి ఎప్పటికప్పుడు పాఠాలు నేర్చుకుంటూ తనలోని ఆలోచనలకు పదునుబెట్టుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే నిత్య జ్ఞాన అన్వేషి అయినవారు ఎలా ప్రవర్తిస్తారో కలాం అలాగే మసులుకున్నారు. ఇందులో దోషమేమీలేదు.
మళ్ళీ మనం అసలు టాపిక్ దగ్గరకు వెళదాం. మాతాచార్యులు, బాబాల చెంతకు అబ్దుల్ కలాం వెళ్లడమేమిటీ, వారికి పాదాభివనందనాలు చేయడమేమిటన్నదే కదా వారి విమర్శ. ఈ విమర్శ చేసేవారు, అలా చేయడం వల్ల తప్పేమిటన్న ప్రశ్న వేసుకోరు. ఎందుకంటే అలా రెండో కోణంలో ఆలోచిస్తే వారి వాదనకు బలం వీగిపోతుందికనుక. అది వీరికి నచ్చదు.
జ్ఞానసముపార్జన చేసేవారి ఆలోచనలు వేరే విధంగా ఉంటాయి. వారు అందరి దగ్గర నుంచి మంచి స్వీకరిస్తారు. ఈ తత్వం ఎలాంటిదంటే, ఇదొక ఫిల్టర్ లాంటిది. అవతల వ్యక్తి ఎవరన్నది ఇక్కడ అప్రస్తుతం. ఎదుటివారు చెప్పే విషయాల్లో `మంచి’ అని భావించే మాటలను ఈ `ఫిల్టర్’ మనసులోపలకు రానిచ్చి, మిగతావాటిని బయటకు పంపిస్తుంటుంది. ఈ లక్షణం ఉన్నవారు తాము ఎవరితోనైనా మాట్లాడతారు. ఎక్కడైనా కూర్చుంటారు. ఎవరి ఆశీస్సులైనా స్వీకరిస్తారు. ఇందులో బిడియపడరు. తమ హోదాకు భంగం వాటిల్లుతుందని అనుకోరు. చిన్నారుల నుంచి స్వామీజీల వరకు ఎవరు ఏ మంచి విషయం చెప్పినా స్వీకరించడమే వీరిపని. అబ్దుల్ కలాం కూడా ఈ కోవకే చెందుతారు. చిన్నతనం నుంచీ చివరి మజలీ షిల్లాంగ్ వరకూ ఆయన పోకడ ఒకేలా ఉంది. ఆయన నిత్యవిద్యార్థి. ఈయన వెళ్ళి కలసిన స్వామీజీలు, లేదా బాబాలపై అనేక ఆరోపణలు ఉండవచ్చు. అయితే వీరికి ఆ విషయాలతో సంబంధంలేదు. జ్ఞానాన్వేషి తపనతో చేసే ప్రయత్నాలుగానే వీటిని భావించాలి. అయితే ఇక్కడ మరో అనుమానం… కలాంని మహాజ్ఞాని అనిఅంతా అన్నప్పుడు ఆయన మళ్ళీ జ్ఞానాన్వేషణకు ప్రయత్నించడమేమిటని… జ్ఞానమన్నది మహాసముద్రం వంటింది. న్యూటన్ మహాశయుడు అన్నట్టు ఎంతటివారికైనా ఇది అంతుచిక్కదు. అందుకే కలాంలాటి వారు నిత్య జ్ఞానాన్వేషులే. ఆ తపనే వారిని బాబాల చెంతకూ, స్వామీజీల చెంతకు తీసుకువెళ్ళిఉంటుంది. అంతమాత్రాన తాటాకులు కట్టడం మంచిదికాదని సదరు విమర్శక పుంగవులు గ్రహిస్తే మంచిది.
– కణ్వస