కేంద్రాన్ని వెనకేసుకుని రావడం అనే బృహత్కార్యం మాత్రమే కర్తవ్యంగా పెట్టుకున్నారు ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. తాజా ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. కొన్ని వేల కోట్ల రూపాయాలు ఆంధ్రాకి కేంద్రం ఇచ్చేసిందని మరోసారి చెప్పారు. ఏపీ మీద భాజపాకి బాధ్యత ఉంది కాబట్టే పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు నితిన్ గట్కరీ వచ్చారన్నారు. మరో కేంద్రమంత్రి కూడా ఆంధ్రాకు వస్తున్నారనీ, రాష్ట్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారని కన్నా చెప్పారు.
విభజన హామీల విషయమై కన్నా మాట్లాడుతూ… అమలు చేయడానికి పదేళ్ల సమయం ఉన్నా, నాలుగేళ్లలోనే ప్రధాని నరేంద్ర మోడీ చెయ్యాల్సిన వాటికన్నా ఎక్కువ చేశారన్నారు. ఆంధ్రా మీద కేంద్రం వివక్ష చూపిస్తోందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. భాజపాకి దేశమంతా ఒక్కటేననీ, అన్ని రాష్ట్రాలూ సమానమే అన్నారు. తమకు ఆగర్భ శత్రువులైన కాంగ్రెస్, వామపక్షాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలను గమనిస్తే పరిస్థితి అర్థమౌతుందన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలో ఉందనీ, పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ భాజపాకి వ్యతిరేకంగా రాజకీయాలు చేస్తారని కన్నా చెప్పారు. అయినాసరే, ఆ రాష్ట్రాల విషయంలో భాజపా ఎలా వివక్షా చూపడం లేదని, ఇతర రాష్ట్రాలతో పోల్చితే ఆంధ్రాకి కేంద్రం ఎక్కువ చేసిందంటూ పోలిక తెచ్చారు.
ఇక్కడ కన్నా మరచిపోతున్న అంశాలు రెండున్నాయి! ఒకటీ.. రాష్ట్రాలకు కేంద్ర కేటాయింపులు, పన్నుల వాటాలు, పథకాల అమలు, బడ్జెట్ లో వాటాలు అనేవి భాజపా దయాభిక్ష కాదు! రాజ్యాంగ ప్రకారం ఇవ్వాల్సినవి ఇవ్వాల్సిందే. ఏ పార్టీలో అధికారంలో ఉన్నా చెయ్యాల్సిన పనులే అవి. ఇక రెండోది.. ఇతర రాష్ట్రాలతో ఆంధ్రాని ఎలా పోల్చుతారు..? ఆంధ్రా విభజనకు గురైంది. రాజధాని లేదు. ఆదాయం లేదు. విభజన చట్టంలో హామీల అమలు లేదు. కొత్త రాష్ట్రం ఏర్పడ్డ క్రమంలో ఆ రాష్ట్రానికి అన్ని రకాలుగా చేయూత అందించాల్సిన బాధ్యత కేంద్రానిది. ఈ రకంగా ఏపీ ఒక ప్రత్యేక పరిస్థితిని ఎదుర్కొంటున్న రాష్ట్రం. అదే తరహాలో ప్రత్యేకమైన బాధ్యత కేంద్రానికి ఉండాలి. అంతేగానీ.. కర్ణాటకను చూడండీ, పశ్చిమ బెంగాల్ కి చాలా ఇస్తున్నాం, భాజపాయేతర రాష్ట్రాలను కూడా బాగానే చూసుకుంటున్నాం అని కన్నా వ్యాఖ్యానిస్తూ ఉండటం బాధ్యతారాహిత్యం.