ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆంధ్రా పర్యటనకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొన్ని విమర్శలు చేశారు. ఆంధ్రాకు చెయ్యాల్సిన కేటాయింపుల్ని వదిలేసి, ఇవాళ్ల మనం బతికి ఉన్నామో లేదో అని చూడ్డానికి వస్తున్నారా అంటూ సీఎం విమర్శించారు కదా. ఆ వ్యాఖ్యలపై ఏపీ భాజపా అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ స్పందించారు. కేంద్రం ఇస్తున్న సొమ్ముతోనే ముఖ్యమంత్రి చంద్రబాబు సోకులు చేసుకుంటున్నారంటూ ఎద్దేవా చేశారు. నెల్లూరులో విలేకరులతో మాట్లాడిన కన్నా… ప్రధానమంత్రి వస్తున్నారంటే చంద్రబాబు భయపడుతున్నారనీ, ఆయన బండారాలు ఎప్పుడు బయటపడిపోతాయో అని ఆందోళన చెందుతున్నారని వ్యాఖ్యానించారు.
మోడీ అంటే భయం కాబట్టే ఆయన పర్యటనపై విమర్శలకు దిగుతున్నారు అన్నారు. రాష్ట్రంలో మంత్రులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారనీ, మందు బాటిల్ దగ్గర్నుంచీ మరుగుదొడ్ల వరకూ అన్ని చోట్లా అవినీతి జరుగుతోందని కన్నా ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చి నిధులను, పథకాలను పేరు మార్చి… వాటికి తమ సొంత పేర్లు పెడుతూ ప్రజలను ముఖ్యమంత్రి మోసం చేస్తున్నారని కన్నా విమర్శించారు.
రాష్ట్ర భాజపా నేతల తీరు ఎలా ఉందో అనేది కన్నా స్పందనలో స్పష్టంగా కనిపిస్తోంది. ప్రధాని రాష్ట్రానికి వస్తున్నప్పుడు… రాష్ట్రానికి మోడీ ద్వారా ఏదైనా భరోసా ఇప్పించే ప్రయత్నం చేస్తున్నామని ఆయన మాట్లాడలేదు. రాష్ట్రంలో సమస్యలే లేనట్టుగా… అన్నీ కేంద్రం ఇచ్చేసిందనీ, ఆంధ్రా ప్రభుత్వాన్ని భాజపా మాత్రమే నడుపుతోందన్న తరహాలో మాట్లాడారు. కేంద్ర పథకాల ద్వారా రాష్ట్రానికి చాలా ఇచ్చేశామని కన్నా అంటున్నారు. అసలు సమస్య పథకాల గురించి కాదు కదా… కేటాయింపు మాటేంటి..? విభజన తరువాత అన్ని రకాలుగా చేయూతనిస్తామని చెప్పి, చట్టంలోని హామీలను అమలు చేస్తామని నమ్మబలికి, ఇతర రాష్ట్రాలతో సమానంగా ఆంధ్రా అభివృద్ధి జరిగే వరకూ ప్రత్యేకంగా చూసుకుంటామని ప్రధాని చెప్పారు. కానీ, అవేవీ అమలు కాలేదు. నిజానికి, కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. రాష్ట్రాల వాటాల ప్రకారం రావాల్సిన పథకాలు, నిధులు అనేవి సహజంగానే వస్తుంటాయి. కానీ, ఆంధ్రా సమస్య అది కాదు ! అన్నిరకాలుగా వెనకబడ్డ ఆంధ్రాను భాజపా ఆదుకున్నదేదీ..? కేంద్ర కేటాయింపుల గురించి వదిలేసి, పథకాల గురించి కన్నా మాట్లాడతారేంటి..?