హైదరాబాద్: చంద్రబాబునాయుడు అమరావతి శంకుస్థాపనకు ఆహ్వానించినప్పటికీ కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవుతారా, లేదా అనే విషయంపై ఒకవారం క్రితందాకా పెద్ద సస్పెన్స్ నెలకొనిఉన్న సంగతి తెలిసిందే. శంకుస్థాపనకు ఒక్కరోజు ముందు ఆ సస్పెన్స్‌కు కేసీఆర్ తెరదించి తాను కార్యక్రమానికి హాజరవుతున్నట్లు మీడియాకు వెల్లడించారు. ఆయన ఆ కార్యక్రమానికి హాజరవటంపై రకరకాల విశ్లేషణలు, వాదనలు వినిపించాయి. ఓటుకునోటు, ఫోన్ ట్యాపింగ్ కేసుల దృష్ట్యా ఇరువురు చంద్రులూ రాజీపడ్డారని కొందరు, జీహెచ్ఎమ్సీ ఎన్నికల దృష్ట్యా సెటిలర్లను ఆకట్టుకోవటంకోసమే హాజరవుతున్నారని మరికొందరు విశ్లేషించారు. అయితే టీఆర్ఎస్ పార్టీ పత్రిక ‘నమస్తే తెలంగాణ’ వీటికి భిన్నంగా మరొక వాదనను తెరపైకి తీసుకొచ్చింది.
‘నమస్తే తెలంగాణ’ సంపాదకుడు కట్టా శేఖరరెడ్డి అమరావతి శంకుస్థాపన కార్యక్రమాన్ని ‘కట్టా-మీఠా’ అనే తన కాలమ్‌లో విశ్లేషించారు. శంకుస్థాపన కార్యక్రమం పూర్తికాగానే – ఆంధ్రా మీడియా, వివిధ పార్టీలు అందరూ కలిసి కేంద్రంమీద, ప్రధాని నరేంద్ర మోడిమీద విరుచుకుపడటం ప్రారంభించారని, ఇది సమర్థనీయం కాదని కట్టా పేర్కొన్నారు. దీనివలన ఏపీ ప్రజలలో భవిష్యత్తుపై మరింత భయాందోళనలను రేపుతున్నారని అభిప్రాయపడ్డారు. రాష్ట్రానికి ఏమేమి కావాలనేది చంద్రబాబు, జగన్, రఘువీరా ఒకే వేదికపై కేంద్రాన్ని అడిగుంటే బాగుండేదని వ్యాఖ్యానించారు.
ఇక కేసీఆర్ ఆ కార్యక్రమానికి హాజరవటంగురించి కట్టా తనదైన శైలిలో విశ్లేషించారు. కేసీఆర్‌తో పేచీలు పెట్టుకుని రచ్చ చేసినంత మాత్రాన తెలంగాణలో టీడీపీ అధికారంలోకి వస్తుందన్న గ్యారెంటీ లేకపోవటం, ఓటుకు నోటు కేసు తన ధైర్యాన్ని దెబ్చతీయటం వంటి కారణాల వలన చంద్రబాబు కేసీఆర్‌తో సుహృద్భావంకోసం ముందడుగు వేశారని కట్టా పేర్కొన్నారు. ఇక కేసీఆర్ కార్యక్రమానికి హాజరు కావాలా, వద్దా అనే చర్చ జరిగిందని, అభిప్రాయ సేకరణ జరిపితే, ఏపీలో ఆయనపై పలువర్గాలు ఆరాధనా భావంతో ఉన్నాయని తెలిసిందని కట్టా రాశారు. కేసీఆర్ ముందుగా ఫిట్మెంట్ ఇచ్చి ఉండకపోతే చంద్రబాబు తమకు అంత ఇచ్చి ఉండేవారుకాదని ఆర్టీసీ కార్మికులు, విభజన జరగకపోతే ఇక్కడ ఏర్పాటవుతున్న కేంద్ర సంస్థలు, వివిధ ప్రాంతాలలో జరుగుతున్న అభివృద్ధి, హడావుడి ఉండేది కావని ఏపీ ప్రజలు అభిప్రాయంతో ఉన్నట్లు పేర్కొన్నారు. కేసీఆర్‌కు అమరావతిలో లభించిన స్వాగత సత్కారాలు, ఆయన లేచి నిలబడి మాట్లాడుతున్నపుడు వ్యక్తమయిన హర్షధ్వానాలు ఆ వాదనను నిజమని రుజువు చేశాయని కట్టా వ్యాఖ్యానించారు.