జాతీయ రాజకీయాల్ని దున్నేయడానికి కేసీఆర్ భారత రాష్ట్ర సమితి పెట్టారు. ఎందుకు ..ఏమిటి ఎలా అన్నది ఆయన వ్యూహం. ఆయన మొదట్లో బీజేపీకి వ్యతిరేకంగా ఉద్యమం అన్నారు.. అప్పట్లో విపక్షాలతో కలిసి పోరాడారు. తానే స్వయంగా చాలా రాష్ట్రాలకు వెళ్లారు. తర్వాత సైలెంట్ అయ్యారు. తర్వాత వారు పిలిచినా వెళ్లడం లేదు. జాతీయ రాజకీయాల గురించి మాట్లాడటం లేదు. బీజేపీని విమర్శించడం తగ్గించేశారు.
కేసీఆర్ రాజకీయంతో అటు బీజేపీ దగ్గరకు తీసుకోవడం కానీ..కేసీఆర్ బీజేపీకి దగ్గరవడం కానీ జరిగే పని కాదు. అలా జరిగితే ఆయన విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింటుంది. అలాగని ఆయన నేరుగా .. విపక్షాలతో కలిసి పోరాడలేకపోతున్నారు. అంత ధైర్యం చేయలేకపోతున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో ప్రత్యర్థి కాబట్టి ఆ పార్టీతో కలిసి పోరాటం చేయలేమనే రిజర్వేషన్ ఆయనకు ఉండవచ్చుకానీ..ఇతర పార్టీలతో కలిసి పోరాడితే పోయేదేం లేదు. కానీ అలాంటిదేమీ చేయడం లేదు.చివరికి తన ఆప్తమిత్రుడు కేజ్రీవాల్ కు వచ్చిన కష్టంపై స్పందించడానికి ఆయన మొహమాట పడుతున్నారు.
అయితే బీజేపీకి అనుకూలంగా..లేకపోతే బీజేపీకి వ్యతికంగా అనే రెండు ఆప్షన్లలో కేసీఆర్ ఏదో ఒకటి ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలని .., అటూ ఇటూ కాకుండా గోడ మీద పిల్లిలా ఉంటే.. రాజకీయంగా ఇబ్బంది కలుగుతుందన్న అభిప్రాయం బీఆర్ఎస్ క్యాడర్ లో వ్యక్తమవుతోంది. ఇదేమీ కాదని.. ప్రస్తుతానికి బిజూ జనతాదళ్ తరహాలో జాతీయ రాజకీయాల్ని పక్కన పెట్టి.. తెలంగాణ ఎన్నికలపైనే దృష్టి పెట్టారని కొంత మంది చెబుతున్నారు. అలా అయితే పార్టీ మారు కూడా మార్చేయడం ఎందుకని ఇతరులకు వచ్చే సందేహం. మరి కేసీఆర్ రాజకీయం ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.