తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్.. అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత రోజే ప్రచారాన్ని ప్రారంభించారు. ఇప్పటికి రెండు నెలలు దాటిపోయింది. కానీ… మొత్తం.. నాలుగు సభలను మాత్రమే పూర్తి చేశారు. ఆయన లక్ష్యం.. యాభై రోజుల్లో వందసభలు. ఇప్పుడు సమయం యాభై రోజులు లేదు. గట్టిగా ఇరవై రోజులు మాత్రమే ఉంది. అయినా ప్రచారం ప్రారంభించలేదు. పందొమ్మిదో తేదీ నుంచి ప్రచారం ప్రారంభించబోతున్నట్లు అధికారిక ప్రకటన వచ్చింది. రోజుకు.. నాలుగైదు సభలు ఉంటాయి. రోజూ ఉంటాయా.. లేదా అన్నదానిపై క్లారిటీ లేదు. ఈ ప్రకారంగా చూస్తే.. వంద సభలు ఉండే అవకాశం లేదు.. కనీసం యాభై సభలు కూడా ఉండే అవకాశం లేదు.
పూర్తిగా తెర వెనుక రాజకీయ వ్యూహాలకు పరిమితమైన కేసీఆర్.. కొద్ది రోజుల కిందట… పార్టీ అభ్యర్థులతో సమావేశమైనప్పుడు.. కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రచార తీరు తెన్నులను విశ్లేషిస్తూ.. “గుట్టకు రాళ్లు మోయవద్దు..” అని నేరుగా చెప్పేశారు. అంటే.. పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాల జోలికి వెళ్లవద్దని… పోటీ ఉన్న నియోజకవర్గాల్లో మాత్రమే… గట్టిగా ప్రచారం చేసి.. బహిరంగసభలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎక్కడ బలహీనంగా ఉన్నారు.. ఎక్కడ బలంతో ఉన్నారన్నదానిపై… ఎప్పటికప్పుడు.. టీఆర్ఎస్కు సర్వేల ఫలితాలు వస్తాయి కాబట్టి… ఆ ప్రకారమే షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు. మొదట రెండు రోజుల షెడ్యూల్ చూసి… టీఆర్ఎస్ నేతలే ఆశ్చర్యపోయారు. ఎందుకంటే…కేసీఆర్… గుట్టకు రాళ్లు మోయవద్దని చెప్పి.. ఆదే పని చేయడమే. ఈ నెల 19, 20న రెండు రోజుల పాటు కేసీఆర్ ఎన్నికల ప్రచారం షెడ్యూల్ను టీఆర్ఎస్ విడుదల చేసింది. ఈ నెల 19న ఖమ్మం, పాలేరు, పాలకుర్తిలో కేసీఆర్ ప్రచార సభల్లో పాల్గొంటారు. ఈ మూడు టీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాలే.
టీఆర్ఎస్ భాషలో చెప్పాలంటే… 70 శాతం ఓట్లు సాధించే నియోజకవర్గాలే. ఇంకా చెప్పాలంటే.. పాలేరులో.. తుమ్మల ఉపఎన్నికల్లో సాధించిన మెజార్టీనే మళ్లీ సాధిస్తామని చెబుతూంటారు. అలాంటి నియోజకవర్గాల్లో రోజంతా ప్రచారం చేయబోతున్నారు. ఇక 20న ఉదయం సిద్దిపేట, దుబ్బాకలో పర్యటిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2.30కి కరీంనగర్ జిల్లా హుజూరాబాద్, ఆ తర్వాత సిరిసిల్ల జిల్లా వేములవాడ, సాయంత్రం 4.30కి కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో కేసీఆర్ ఎన్నికల ప్రచార సభలో ప్రసంగిస్తారు. ఈ షెడ్యూల్ చూసి.. కాంగ్రెస్ పార్టీ నాయకులు… వారి కుంచుకోటల్లాంటి నియోజకవర్గాల్లోనే పరిస్థితి తేడాగా ఉంది కాబట్టి.. కేసీఆర్… ప్రచారం చేస్తున్నారని..మిగతా నియోజకవర్గాల్లో పరిస్థితి ఎలా ఉందోనని విశ్లేషణలు ప్రారంభించారు.