తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కెటిఆర్‌కు అత్యధిక ప్రాధాన్యత నిస్తూ వారసత్వ సమస్యను తేల్చేసినప్పటికి ఇప్పటికిప్పుడు అధికారం అప్పగించాలని ఆదుర్దా పడటం లేదట. దానికి ఆయన ఒక నమూనా ఎంచుకున్నారు. భారత రాజకీయాల్లో మరీ ముఖ్యంగా రాష్ట్రాల్లో వారసత్వాలు కొత్త గాకున్నా అనేక తరహాలు వున్నాయి. ఇందిరా సంజరు రాజీవ్‌ల పద్ధతి ఒకటి. తర్వాత సోనియాగాందీతో కొనసాగి ఇప్పుడు రాహుల్ గాంధీ వరకూ రాబోతున్నది. ఇక రాష్ట్రాలలో మరో పరిస్థితి. దేవీలాల్, చరణ్‌సింగ్ వంటి పాత వారిని వదిలేస్తే- ఎన్టీఆర్ అల్లుడు చంద్రబాబు నాయుడు మామ ఆశీస్సులతో ఎదిగి మారిన పరిస్థితులలో వ్యతిరేకించి ముఖ్యమంత్రి అయ్యారు. తర్వాత కాలంలో బద్ద విరోధులుగా మారినా చంద్రబాబు దగ్గుబాటి ఇద్దరినీ ఎన్టీఆర్ ఇష్టంగానే పైకి తెచ్చారు. తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఇద్దరు కుమారులు అళగిరి స్టాలిన్ మధ్య నలిగినా స్టాలిన్నే వారసుడుగా చేసుకున్నారు. మధ్యలో కుమార్తె కనిమొళిని ఎంపిని చేశారు. మేనల్లుడు మారన్‌ను కూడా మంత్రిని చేశారు. ఏం చేసినా పార్టీ ప్రభుత్వం పగ్గాలు తన చేతిలోనే పెట్టుకున్నారు. యువకుడుగా వుండగా వారసత్వ ప్రకటన జరిగిన స్టాలిన్ ఇప్పటికి ప్రతిపక్ష నేత కాగలిగారు గాని పార్టీకి ఇంకా వర్కింగ్ అద్యక్షులే! ఇక ఉత్తర ప్రదేశ్ ఎస్పి నేత ములాయం సింగ్ యాదవ్ కుమారుడినే ముఖ్యమంత్రిని చేశారు గాని మరోసారి ఎన్నికలకు వెళ్లేముందు ఆయనకూ కుమారుడు అఖిలేష్‌కు మధ్య తీవ్ర సమరమే నడిచింది. ఈ ముగ్గురిలోనూ కెసిఆర్ ఎంచుకున్నది కరుణానిధి నమూనా అని టిఆర్ఎస్కు చెందిన చైర్మన్(అంటే ఏదో కమిషన్ చైర్మన్) ఒకరు వివరించారు. ఆయన తొందరపడి పదవి పరివర్తన పూర్తి చేసి సమస్యలు కొనితెచ్చుకోరని అయితే వారసత్వంపై అస్పష్టత కూడా వుండొద్దనుకుంటారని ఆ నాయకుడు స్పష్టంగా చెప్పారు. వాస్తవానికి ఒకప్పుడు ఆయన మహారాష్ట్రలోని బాల్‌థాకరే నమూనా అనుసరించాలనుకున్నారట. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో కీలక శాఖ చూస్తున్న ఒక మంత్రి ఎన్నికలకు ముందు ఈ మాట నాతో చెప్పారు. అంటే దళితుడిని ముఖ్యమంత్రిని చేసి తను థాకరే లాగా రీమోట్ పాలన చేయడం. అయితే థాకరే హయాంలోనే ఉద్భవ్ ఠాక్రే, రాజ్ థాక్రేల మధ్య విభేదాలు చీలికకు దారి తీశాయి. పైగా టిఆర్ఎస్కు వచ్చిన మెజార్జి కూడా చాలా తక్కువ గనక కెసిఆర్ ఆ ఆలోచన మానుకుని అధికారబాధ్యతలు తీసుకున్నారు. వారసత్వ ప్రక్రియ ప్రారంభించారన్న మాట.