ఇప్పటికే పదకొండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తెరాసలో చేర్చుకున్న సంగతి తెలిసిందే. జంప్ జిలానీలు తెరాస ఆఫీస్ కి రావడం… పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో చర్చలు జరపడమూ అయిపోయింది. ఇక, మిగిలింది తెరాస ఎల్పీలో కాంగ్రెస్ ఎల్పీని విలీనం చెయ్యడం ఒక్కటే అనుకున్నారు. వీలనం కోసం ఓ లేఖను సిద్ధం చేసి, దాన్ని స్పీకర్ కు పంపించాలని రెండు వారాల కిందటే అనుకున్నారు. మరో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారనీ, వారినీ రప్పించేసి కండువా కప్పేస్తే… సీఎల్పీ విలీనానికి అవసరమైన 13 మంది సభ్యుల సంఖ్య సరిపోతుందన్నారు. వీరందరితో సంతకాలు చేయించి, స్పీకర్ కు లేఖ ఇవ్వాలనే వ్యూహంలో తెరాస అధినేత ఉన్నారనీ కథనాలొచ్చాయి. కానీ, ఇప్పుడా విలీన చర్చే ప్రస్తుతం తెరాస శ్రేణుల్లో వినిపించడం లేదు. మొదలుపెట్టిన సీఎల్పీ విలీన ప్రక్రియకి సీఎం కేసీఆర్ ఎందుకు బ్రేకులు వేశారు..? దీని వెనక వేరే కారణం ఉందా.. అంటే, ఉందనే చెప్పాలి.
త్వరలోనే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇంకోపక్క, ఇంటర్ బోర్డు వివాదం తెరాస ప్రభుత్వంపై తీవ్ర విమర్శలకు కారణమైంది. విద్యార్థుల ఆత్మహత్య ఘటనలపై ప్రజల్లో తీవ్రమైన చర్చ జరుగుతోంది. రెండోసారి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రమాణం చేసిన తరవాత నుంచీ పాలన గాలికి వదిలేశారనే విమర్శలకు బలం చేకూర్చినట్టయింది. ఇలాంటి సందర్భంలో మరోసారి ఫిరాయింపులను ప్రోత్సాహిస్తే మరిన్ని విమర్శలకు ఆస్కారం ఉంటుందనేది సీఎం కేసీఆర్ వ్యూహంగా తెలుస్తోంది. సంపూర్ణ మెజారిటీతో గెలిచాక కూడా… కాంగ్రెస్ ను నిర్వీర్యం చేయాలనే తెరాస ఆలోచనకు ప్రజల్లో విమర్శలు ఉన్నాయనేది కూడా వారికి ఉన్న సమాచారంగా ప్రచారం జరుగుతోంది. సీఎల్పీని విలీనం చేయాలనే ప్రతిపాదనపై ప్రజల నుంచి కొంత విముఖత వ్యక్తమౌతోందనీ, కాబట్టి ఇలాంటి సమయంలో జంప్ జిలానీలని ప్రోత్సామిస్తే.. దాని ప్రభావం ఎన్నికలపై ఉంటుందని భావిస్తున్నారట!
సీఎల్పీ విలీనానికి కేసీఆర్ ఇచ్చిన ఈ బ్రేక్ ను కాంగ్రెస్ పార్టీ ఎలా అర్థం చేసుకుంటోందనేదే ప్రశ్న? దీన్నొక అవకాశంగా తీసుకుని, తెరాసకు కావాల్సిన మరో ఇద్దరు ఎమ్మెల్యేలను బయటకి వెళ్లనీయకుండా కట్టడి చేసేందుకు కావాల్సిన సమయం ఇప్పుడు కాంగ్రెస్ కి ఉన్నట్టే. దీంతోపాటు, ఫిరాయింపులూ ఇంటర్ బోర్డు అవకతవకల్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లగలిగితే… జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు కొంత ప్లస్ అయ్యే అవకాశమూ లేకపోలేదు. మరి, దీన్ని కాంగ్రెస్ వినియోగించుకుంటోందో లేదో చూడాలి.