మార్చి నెల నుంచి తీహార్ జైల్లో ఉన్న కవితకు ధైర్యం చెప్పేందుకు ప్రతి వారం పార్టీ నేతల్ని పంపిస్తున్నారు. మొదటి రెండు నెలలు అసలు ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన తర్వాత మాత్రం వారానికోసారి ఎవరో ఒకరు వెళ్తున్నారు. ఓ సారి కేటీఆర్..మరోసారి మహిళా నేతలు వెళ్లి వచ్చారు. ఈ సారి హరీష్ రావు వెళ్లారు. తీహార్ జైల్లో కవితతో ములాఖత్ అయి ధైర్యం చెప్పి వచ్చారు. కేసు విషయాలు ఏమైనా మాట్లాడారో లేదో స్పష్టత లేదు.
కవిత అరెస్టు అయిన తర్వాత ఓ సారి ఆమె తల్లి కూడా వెళ్లి వచ్చారు. కానీ కేసీఆర్ మాత్రం వెళ్లలేదు. అసలు ఢిల్లీ వైపు చూడలేదు. పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా ప్రచారం చేశారు. తర్వాత పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. వ్యవసాయంతో పాటు ఫామ్ హౌస్ లో ఓమ్నీ కార్లు నడుపుతున్నారు. వరుసగా పార్టీకి నేతలు గుడ్ బై చెబుతూంటే.. ఇటీవల రోజూ కొంత మందిని పిలిపిస్తున్నారు. మాట్లాడుతున్నారు. పార్టీ మారవద్దని బుజ్జగిస్తున్నారు.
కానీ కవిత గురించి మాత్రం ఆయన బహిరంగంగా ఎలాంటి ప్రకటనలు చేయడం లేదు. ఢిల్లీలో ప్రత్యేకంగా ఓ పార్టీ ఆఫీసు నిర్మించారు. ఆ పార్టీ ఆఫీసు నర్మాణం ఆలస్యమవుతుందని మరో భవనాన్ని లీజుకు తీసుకుని ప్రారంభించారు. ఆ తర్వాత ఢిల్లీ మొహమే చూడటం లేదు. పెద్ద ఖర్చుతో నిర్మించిన ఢిల్లీ సొంత కార్యాలయాన్ని కూడా ప్రారంభించలేకపోయారు. ఒక్క ఎంపీ కూడా గెలవకపోవడంతో ఆయన ఢిల్లీకి వెళ్లేందుకు ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు. అయితే కవితను బెయిల్ పై బయటకు తెచ్చేందుకు ఆయన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.