టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేసేసి … వివిధ రాష్ట్రాల్లో నేతల్ని ఆకర్షించడానికి కేసీఆర్ చాలా ప్రయత్నం చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కీలక నేతల్ని ఆకర్షించారు. అయితే తరవాత ఆయన ప్లాన్ మార్చుకోవడంతో బీఆర్ఎస్ లో చేరిన వారంతా బలి పశువులు అయ్యారు. ముఖ్యంగా ఏపీ, ఒరిస్సా నాయకులు మొత్తం రాజకీయ భవిష్యత్ ను రిస్క్ లు పెట్టేసుకున్నారు. ఏపీ నుంచి జనసేనలో కీలక నేతగా ఉన్న తోట చంద్రశేఖర్ ను చేర్చుకుని ఆయనకు ఇంచార్జ్ గా ఇచ్చారు . ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ గురించి కేసీఆర్ కనీసం పట్టించుకోవడం లేదు. ఆయన పార్టీ ఆఫీసు ప్రారంభించుకుంటే కనీసం ప్రతినిధుల్ని కూడా పంపలేదు. దీంతో ఆయన కూడా కనిపించడం మానేశారు. హైదరాబాద్ మియాపూర్ భూముల్లో ఆయనకు లబ్ది కలిగింది కాబట్టి… ఆయన పార్టీ వీడిపోరని చెబుతున్నారు.
ఇక బీజేపీలో ఉన్న ఒరిస్సా మాజీ సీఎం గిరిధర్ గమాంగ్ ను ప్రత్యేక విమానాల్లో పిలిపించుకుని మరీ కండువా కప్పారు. ఆయనతో పాటు ఆయన కుమారుడు… ఇతరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు. ఒడిషాను దున్నేద్దామని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తీరా చూస్తే అసలు పట్టించుకోవడం మానేశారు. పార్టీని నడిపేందుకు కనీస ఆర్థిక సాయం కూడా చేయడం లేదు. దీంతో మోసపోయామని అనుకున్న గమాంగ్.. మళ్లీ కాంగ్రెస్ పార్టీ గూటికి చేరిపోతున్నారు. ఇతర రాష్ట్రాల్లోని రైతు నేతల్ని కూడా చేర్చుకున్నారు. వారినీ ఇప్పుడు పెద్దగా పట్టించుకోవడం లేదు.
తాజాగా మహారాష్ట్ర లోనూ బీఆర్ఎస్ లో చేరిన వారు రివర్స్ అవుతున్నారు. ఇటీవలే పార్టీలో చేరిన కొంత మంది నేతలు బీజేపీకి బీ టీం అని ఆరోపిస్తూ రాజీనామాల బాట పట్టారు. కేసీఆర్ కేవలం మహారాష్ట్రపైనే దృష్టి పెట్టారు. అక్కడ్నుంచి వచ్చి కండువాలు కప్పించుకుని వెళ్తున్నారు .కానీ అక్కడకు వెళ్లాక.. వారు ఇతర పార్టీలతో మాట్లాడుకుంటున్నారు. మొత్తంగా… బీఆర్ఎస్ ను నమ్మి ఇతర రాష్ట్రాల్లోని నేతలు పార్టీలో చేరలేని పరిస్థితులు ఏర్పడ్డాయి.